హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోరం జరిగింది. వివాహం జరిగి 20 రోజులైనా పూర్తి కాకుండానే ఓ యువతి తన భర్తను హత్య చేసింది. భర్త వేధింపులను భరించలేకనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

హైదరాబాదులోని టప్పాచబుత్రా పోలీసు స్టేషన్ పరిధిలో ఆ సంఘటన జరిగింది. ముజాహెద్ నగర్ కు చెదిన అస్లాం (25), జిర్రా మహబూబ్ కాలనీకి చెందిన సమ్రిన్ ను గత నెల 19వ తేదీన వివాహం చేసుకున్నాడు. 

వివాహం జరిగిన రోజు నుంచే అస్లాం తన వికృత రూపం ప్రదర్శిస్తూ వచ్చాడు. పీకల దాకా మద్యం తాగి వచ్చి రాత్రి పూట భార్యను బూతులు తిడుతూ వేధిస్తూ వచ్చాడు. ఈ కారణంగానే గురువారం రాత్రి ఇరువురి మధ్య గొడవ జరిగింది.

శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అస్లాం నిద్రపోయాడు. ఆ సమయంలో భార్య సమ్రిన్ రోకలితో అస్లాంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అస్లాం కేకలు విన్న కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రమైన గాయాలు తగిలినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. 

చికిత్స పొందుతూ అతను మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. అస్లామ్ భార్యను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.