Asianet News TeluguAsianet News Telugu

సమీప బంధువుతో మహిళ వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని భర్త హత్యకు ప్రియుడితో కలిసి సుపారీ

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Wife Extramarital Affair Leads To Husband Murder with Supari Gang in hyderabad
Author
First Published Sep 5, 2022, 4:19 PM IST

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన రాగ్యకు పెద్దవూర మండలం ఊరబావితండాకు చెందిన రోజాతో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. రాగ్య మణికొండలో కారు డ్రైవర్‌గా పని చేసస్తున్నారు. 

అయితే రాగ్యకు బావ వరుస అయిన ఇబ్రహింపట్నంలోని ఎల్లాపూర్‌తండాకు చెందిన లక్పతితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే తమ వివాహేతర సంబంధానికి రాగ్య అడ్డుగా ఉన్నాడని రోజా, లక్పతిలు భావించారు. దీంతో రాగ్యను అంతమొందించాలనే ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో రాగ్యను హత్య చేయించేందుకు.. నేరెడుగొమ్ము మండలం బుగ్గతండాకు చెందిన మాన్‌సింగ్, బాలోజీతో డీల్ కుదుర్చుకున్నారు. రాగ్యను హత్య చేస్తే రూ. 20 లక్షలు ఇస్తామని  చెప్పారు. 

దీంతో సుపారీ గ్యాంగ్.. రాగ్యతో పరిచయం ఏర్పాటు చేసుకుంది. ప్లాన్ ప్రకారం ఆగస్టు 19న హైదరాబాద్ నగర శివార్లలో రాగ్యతో కలిసి సుపారీ గ్యాంగ్ సభ్యులు మద్యం తాగారు. అక్కడే అతడిని హత్య చేసి.. మృతదేహానికి ఇనుప కడ్డీలు కట్టి నేరెడుకొమ్ము మండలం కాచరాజుపల్లి సమీపంలో సాగర్‌ వెనుక జలాల్లో పడవేశారు.  

మరోవైపు తన భర్త కనిపించడం లేదని రోజా.. అత్తమామలకు సమాచారం ఇచ్చింది. దీంతో అనుమానం వచ్చిన వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. రాగ్య కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రాగ్య తరచూ ఫోన్‌లో మాన్‌సింగ్, బాలోజీతో సంభాషించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో నాగర్జున సాగర్ వెనుక జలాల్లో రాగ్య మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఇక, ఈ కేసులో నిందితులను తమకు అప్పగించాలని రాగ్య కుటుంబ సభ్యులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios