పురుట్లోనే భార్య మృతి, తట్టుకోలేక భర్త ఆత్మహత్య...అనాథగా చిన్నారి...
హైదరాబాద్ లో ఓ జంట మృతి..విషాదాన్ని నింపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పురిట్లోనే చనిపోవడంతో తట్టుకోలేక.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ లోని రెజిమెంటల్ బజార్లో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతీ యువకులు ప్రేమించుకున్నారు. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. అయినప్పటికీ వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక.. వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఉన్న ఊరు నుంచి నగరానికి వచ్చి కాపురం పెట్టారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. పుట్టబోయే బిడ్డ కోసం ఇద్దరు ఎన్నో కలలు కన్నారు. వారి ప్రేమ చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో… ఆ కుటుంబంపై పగ పట్టింది. డెలివరీ సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యువతి పురిట్లోనే కన్నుమూసింది.
ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇక లేదన్న బాధను తట్టుకోలేక.. ఆ భర్త కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీంతో రోజుల చిన్నారి అనాధగా మిగిలిపోయింది. ఈ హృదయ విదారక ఘటన సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ జిఆర్ పి పోలీసుల కథనం ప్రకారం... నారాయణపేట జిల్లా మక్తల్ కు చెందిన ఉప్పరి ఆంజనేయులు కుమారుడు నవీన్ కుమార్ (28) తన ఇంటి పక్కనే ఉండే భీమేశ్వరి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఏడాది క్రితం వీరిద్దరూ పెళ్లి చేసుకుని నగరానికి వచ్చేశారు. ఇక్కడ మౌలాలి ప్రగతి నగర్లో నివాసం ఉంటున్నారు. నవీన్ కుమార్ ఆటో నడుపుతున్నాడు.
హైదరాబాద్ లో విషాదం.. ఆల్కహాల్ సంపులో పడి బాలుడి మృతి...
ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో భీమేశ్వరికి నొప్పులు వచ్చాయి. దీంతో పక్కింటి మహిళ సహాయంతో ఆమెను నేరేడ్మెట్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసవం తరువాత భీమేశ్వరి పరిస్థితి విషమంగా ఉండడంతో తల్లితో పాటు శిశువును గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. శిశువు వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతున్న భీమేశ్వరి అదే రోజు రాత్రి ఆస్పత్రిలో మృతి చెందింది. చిన్నారి వెంటిలేటర్‌పై, మార్చురీలో భార్య మృతదేహం.. ఉండటంతో నవీన్ కుమార్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. బాధను భరించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
శుక్రవారం రాత్రి 8.55 గంటల సమయంలో సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లుగా ఆర్పిఎఫ్ హోంగార్డు గుర్తించాడు. దీంతో జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతుడి జేబులో లభ్యమైన సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం భార్య భర్తల మృతదేహాలు గాంధీ మార్చురీలో ఉన్నాయి. పుట్టిన చిన్నారి ఇది ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండటం చూసిన వారిని కంటతడి పెట్టిస్తోంది.