మహారాష్ట్ర, హర్యానా, బిహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం… ఇలా ఒక్కో రాష్ట్రాన్ని బిజెపి గెలుచుకుంటూ వస్తోందని… ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చిందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. తెలంగాణలోనూ బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.

బిజెపి జాతీయ నాయకులు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో.. అమిత్ షా స్వయంగా హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చార్మినార్ సమీపంలోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

హైదరాబాద్ పర్యటన సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో తెలుగులో పోస్టు చేయడం కూడా చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌లో భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు చేయడం తన అదృష్టమని.. ప్రజలందరూ సుఖశాంతులు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.

బేగంపేట నుండి నేరుగా చార్మినార్ కు అమిత్ షా

సోమవారం (నవంబర్ 2) మధ్యాహ్నం అమిత్ షా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

హైదరాబాద్ లో అమిత్ షా పాదయాత్ర

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు సపోర్ట్ గా తెలంగాణ బీజేపీ ఈ మహా పాదయాత్రను నిర్వహించింది. 'లోక్‌తంత్ర బచావో.. అరాచకత హఠావో' (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకత్వాన్ని తొలగించండి) అనే నినాదంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర ప్రారంభమై, అబిడ్స్ మీదుగా మొజంజాహి మార్కెట్ (ఎంజే మార్కెట్) వరకు కొనసాగింది. అక్కడే నిర్వహించిన సభలో అమిత్ షా ప్రసంగించారు.

ఈ పాదయాత్రలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయవాదులు, వైద్యులు, ప్రజలు కూడా పాల్గొనేలా పార్టీ ఏర్పాట్లు చేసింది.

ఈ మహా పాదయాత్రకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు ఓట్ బచావో పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని, ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం చేపడుతున్న SIR (సర్) ప్రక్రియపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం చెప్పడంతో పాటు, SIR ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా బీజేపీ హైదరాబాద్‌లో ఈ మహా పాదయాత్ర చేపట్టింది. ఈ కార్యక్రమం ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న బీజేపీ ప్రచార కార్యక్రమాల్లో భాగమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై అమిత్ షా తీవ్ర విమర్శలు

మహా పాదయాత్ర ముగింపు సభలో అమిత్ షా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. SIR ప్రక్రియను కాంగ్రెస్ వ్యతిరేకించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల కోసమే కాంగ్రెస్ సర్ ను వ్యతిరేకిస్తోందని అమిత్ షా ఆరోపించారు. దేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉండాలని, అక్రమంగా దేశంలోకి వచ్చినవారిని గుర్తించి బయటకు పంపించడంలో బీజేపీ వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు.

13 కోట్ల ఓట్లు తొలగించారంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. తొలగించిన ఓట్లలో విదేశీ చొరబాటుదారులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓట్లు కలిగినవారు, మరణించిన వ్యక్తుల పేర్లు ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. రాజ్యాంగబద్దంగానే సర్ ప్రక్రియ కొనసాగుతోందని... దమ్ముంటే ఆపాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల్లో గెలిచింది ఈ సర్ వల్ల కాదని, ప్రజల సపోర్ట్ తోనే అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు.

తెలంగాణలోనూ బీజేపీదే అధికారం..

తెలంగాణలో బీజేపీ భవిష్యత్తుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడుతోందని, తెలంగాణలోనూ ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీని తెలంగాణ యువమోర్చా అధ్యక్షుడు కూడా ఓడించగలడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

తెలంగాణ ప్రభుత్వంపై కూడా అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ 'RR ట్యాక్స్' పేరుతో తెలంగాణను ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (EVM) ట్యాంపరింగ్ జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలను ప్రస్తావిస్తూ.. అదే నిజమైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడల్లా ఈవీఎంలపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు.

తెలంగాణను అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అమిత్ షా అన్నారు. ఈ అవినీతిని ఒవైసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకోలేదు... కేవలం మోదీ నేతృత్వంలో బీజేపీ మాత్రమే తెలంగాణను కాపాడగలుగుతుందన్నారు. బీజేపీ కార్యకర్తలంతా కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ను భూస్థాపితం చేసి, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు శ్రమించాలని అమిత్ షా సూచించారు.

మొత్తంగా అమిత్ షా హైదరాబాద్ పర్యటన, భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం, మహా పాదయాత్ర, కాంగ్రెస్‌పై ఆయన చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ చర్చకు తెరలేపాయి.

Scroll to load tweet…