వరంగల్ జిల్లా హసన్ పర్తిలో జంట హత్యలు కలకలం రేపాయి.  దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కారపు పొడి చల్లి తలపై బాది గొంతు కోసి కిరాతకంగా ప్రాణాలు తీశారు. హసన్‌పర్తి ప్రధాన రహదారి పక్కనే ఉన్న గడ్డం దామోదర్(65), గడ్డం పద్మ(55) దంపతులు ఎన్నో సంవత్సరాల నుంచి  కిరాణా దుకాణం నడుపుతున్నారు.

ఈరోజు దంపతులిద్దరూ దుకాణం తెరవకపోవడం, తలుపులు కూడా మూసి ఉండటంతో పక్కనే ఉన్న హోటల్ నిర్వాహకురాలు అనుమానం వచ్చి  చూశారు. కాగా.. దంపతులు ఇద్దరూ చనిపోయి కనిపించారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. వారు వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా సామానంతా చిందర వందరగా ఉంది. బంగారం కూడా పోయినట్లు గుర్తించారు. సొమ్ము కోసమే ఈ జంట హత్యలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న నగర సీపీ రవీందర్, ఇతర అధికారులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం, జాగిలాలను రప్పించి నిందితుల ఆచూకి కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. దామోదర్‌ను ఇంట్లోనే హత్య చేయగా.... పద్మను ఇంటి ముందున్న బాతురూమ్‌లో అతి దారుణంగా గొంతు కోసి చంపారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా ఆనవాళ్లు కనపడుతున్నాయని పోలీసులు తెలిపారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.