సిఎం సభ కోసం స్కూళ్లకు సెలవు సరికాదుబస్సుల కోసం పిల్లలను ఆగం చేస్తరా?కొత్త పద్ధతి తెలంగాణలో మంచిదికాదురవాణా శాఖ అధికారుల తీరు దారుణం
ఆ రెండు జిల్లాల్లో బడులు బంద్ అంట.....! నిజామబాద్, జగిత్యాల లో గురువారం ప్రయివేటు బళ్లు బందు పెడతరట. నిజామాబాద్ జిల్లాల గురువారం నాడే సిఎం కెసిఆర్ పర్యటన ఉన్నది. సిఎం పర్యటన సందర్భంగా అ ప్రాంతంలో ప్రయివేట్ పాఠశాలలు బంద్ చేయడమేంటో అంతుచిక్కడంలేదు. ఇంతకీ కెసిఆర్ రైతు మీటింగ్ కు ప్రయివేటు స్కూళ్ల బందుకు లంకె ఎట్ల కుదిరిందో తెలుస్తలేదు. గులాబీ బాస్ అంటే ప్రయివేట్ బడుల యాజమాన్యాలకు భయమా? లేక భక్తి కావొచ్చా? లేకపోతే భయంతో కూడిన భక్తి అయి ఉండొచ్చా? కారణమేదైనా సిఎం పర్యటన పుణ్యమా అని ఒకరోజు బడి పోరగాళ్లకు సెలవు ఇచ్చేసిర్రు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఅర్ నిజామబాద్ జిల్లాలో గురువారం జరగనున్న శ్రీరాంసాగర్ రైతు పునరుజ్జీవ మహా సభకు హాజరు కానున్నారు. ఈ సభను కెసిఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. దీనికోసం జనాలను తరలించేందుకు చాలా బస్సులు అవసరమయ్యాయి. ఇంకేముంది ప్రయివేట్ పాఠశాలలకు యాజమాన్యాలు సేలవు ప్రకటించేశాయి. సియం పర్యటనకు, ప్రయివేట్ బడుల బంద్ కు సంబంధం ఏంటి అంటరా? అదే నండి పెద్ద సార్ మీటింగ్ కు ప్రజలను తరలించాలి అంటే వాహనాలు కావాలి కదా? అందుకే అ ప్రాంతంలోని స్కూళ్లకు సెలవులిచ్చేసి ఆ పిల్లలు తిరిగే స్కూల్ బస్సులను జనాల తరలింపు కోసం వాడతారట. దీనికోసమే బడి బస్సులు రావంట స్కూళ్లు లేవంట. అదీ మ్యాటర్.

విద్య వ్యవస్థలో మార్పు అంటే ఇదేనా...? రాజకీయ సభలకు, పర్యటనలకు విద్యవ్యవస్థను వాడుకోవటం ఎంత వరకు సమంజసం? ఎన్నికల సమయంలో స్కూళ్లు ముసేస్తారు. ప్రభూత్వం ఫీజులు విడుదల చేయడం లేదని, కళాశాలల్లో సీట్లు సరిగ్గా కేటాయించడం లేదని విద్యార్థి సంఘాలు విద్య సంస్థల బంద్ కు పిలుపునిస్తాయి. ఎవరైన ప్రముఖ రాజకీయ నాయకుడు మరణిస్తే , దేశంలో ఏలాంటి అలజడైనా, ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా ముందు పాఠశాలల బందు చేయడమే మొదటి కర్తవ్యంగా భావిస్తారు జనాలు. ఏ రకమైన నిరసన తెలపడానికైనా పాఠశాల బంద్ కావాల్సిందే.
ఇదంతా ఒక ఎత్తయితే విద్యా వ్యవస్థను నియంత్రించాల్సిన సర్కారు ఏకంగా సిఎం మీటింగ్ ఉందంటూ బళ్లకు సెలవులియ్యాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు కరెక్టు? బడి పిల్లల బస్సుల కోసం ప్రయివేటు పాఠశాలలకు ఏకంగా అధికార వర్గాలు తాఖీదులు పంపించి బలవంతపు సెలవులిప్పించడం ఏమనుకోవాలి? బళ్లు బందు చేయాలని ట్రాన్స్ పోర్టు అధికారులు తాఖీదులు పంపుడు ఏ విధంగా న్యాయమైనది?
ఏది ఏమైనా తెలంగాణ సర్కారు పబ్లిక్ మీటింగ్ పేరుతో స్కూల్ పిల్లలను డిస్టర్బ్ చేయడం మాత్రం శ్రేయస్కరం కాదని విద్యావేత్తలు అంటున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ ఈ తరహా పద్ధతి లేకపోగా తెలంగాణలోనే షురూ చేయడం బాధాకరమైన విషయమే.
రచయిత - శ్రీకాంత్ రెడ్డి.
