హైదరాబాద్: ప్రజా కూటమిని  సింగిల్ పార్టీగా గుర్తించాలని  రాష్ట్ర గవర్నర్‌ను కోరినట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

సోమవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ ‌నరసింహాన్‌తో సమావేశమైన తర్వాత ప్రజా కూటమి నేతలు  మీడియాతో మాట్లాడారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు , ఎమ్మార్పీఎస్, తెలంగాణ ఇంటి పార్టీలు పోటీ చేసిన విషయాన్ని డాక్యుమెంట్ సహా గవర్నర్‌కు సమర్పించినట్టు చెప్పారు. ఎన్నికల కమిషన్‌ కు సమర్పించిన డాక్యుమెంట్లను కూడ గవర్నర్ కు అందించినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

అతి పెద్ద పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాల్సిన పరిస్థితి వస్తే  తమ కూటమిని  సింగిల్ పార్టీగా గుర్తించాలని గవర్నర్‌ను కోరామని ఉత్తమ్ చెప్పారు.ముందస్తుగానే తాము గవర్నర్‌ను కలిసినట్టు ఉత్తమ్ చెప్పారు.

కూటమికి సంపూర్ణ మెజారిటీ వస్తోందని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు. సర్కారియా కమిషన్  సిఫారసుల ఆధారంగా కూటమిని  సింగిల్ పార్టీగా చూడాల్సిన అవసరం ఉందని  కోదండరామ్ చెప్పారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని  ఎన్నికల్లో అక్రమాలకు టీఆర్ఎస్ పాల్పడిందని  టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు.  2014 ఎన్నికల్లో రాష్ట్రపతి పాలన సమయంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజలు పీపుల్స్ ఫ్రంట్‌ను ఆదరించినట్టుగా ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

గవర్నర్‌తో ప్రజా కూటమి నేతల భేటీ

ఫలితాల ముందే హైటెన్షన్: కేసీఆర్‌తో అసద్ భేటీ, గవర్నర్‌తో కూటమి నేతలు