హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్న నేపథ్యంలో ప్రజాకూటమి నేతలు వ్యూహారచన చేస్తున్నారు.ఈ మేరకు ఇవాళ గవర్నర్ తో భేటీ కానున్నారు. ఇదిలా ఉంటే  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్‌తో భేటీ కానున్నారు.హంగ్ వస్తే  ఏం చేయాలనే దానిపై ప్రధాన పార్టీలు  ముందుగానే  కసరత్తు చేస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు  డిసెంబర్ 11వ తేదీన వెల్లడికానున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత ఏ పార్టీకి మెజారిటీ వస్తోందనే విషయమై స్పష్టత రానుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు  ముందస్తు ఎన్నికల వ్యూహలను ఖరారు చేస్తున్నారు.

ప్రజా కూటమికి చెందిన పార్టీల నేతలు సోమవారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు గవర్నర్ నరసింహాన్ ను కలవనున్నారు. గవర్నర్  భేటీ కంటే ముందుగానే కూటమి నేతలు డీజీపీని కలవాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని కూటమి నేతలు ముందుగానే గవర్నర్‌ను కలవనున్నారు. తమను ఓకే పార్టీగా గుర్తించాలని  కూటమి నేతలు  గవర్నర్‌ను కోరనున్నారు. విడి విడిగా ఈ నాలుగు పార్టీలను గుర్తిస్తే  నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున  వ్యూహత్మకంగా  ఈ నాలుగు పార్టీలను ఒకే పార్టీగా గుర్తించాలని  కూటమి నేతలు  గవర్నర్‌ను కోరనున్నారు.

ఎన్నికలకు ముందుగానే ఈ నాలుగు  పార్టీలు కూటమిగా ఏర్పడినందున ప్రభుత్వ ఏర్పాటుకు కూటమిని ఒకే పార్టీగా గుర్తించాలని  కూటమి నేతలు గవర్నర్ ను కోరే అవకాశం ఉంది. గతంలో ఇదే విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడ కూటమి నేతలు గవర్నర్‌కు వివరించనున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ తరహా ఘటనలను  కూడ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు.

మరో వైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు దక్కకపోతే  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో కూడ చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమైంది. ఎఐసీసీలో కీలక నేతలు  ఎంఐఎంతో  చర్చించే అవకాశం కూడ లేకపోలేదు.

ఇదిలా ఉంటే  ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఇవాళ కేసీఆర్‌తో ఎంఐఎం చీఫ్ అసద్  మధ్యాహ్నం సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని  అనుసరించాల్సిన వ్యూహంపై  కేసీఆర్ తో అసద్ చర్చించే అవకాశం  ఉంది.

కర్ణాటక తరహలో జేడీఎస్  ఏ తరహలో పాత్రను పోషించిందో తాము కూడ ఈ ఎన్నికల్లో  ఆ పాత్రను పోషిస్తామని ఎంఐఎం కూడ  ప్రకటించడం  కొంత ఆసక్తిని కల్గించే పరిణామం.

మరోవైపు ఎంఐఎంను దూరం పెడితే టీఆర్ఎస్‌కు తాము మద్దతిచ్చేందుకు సిద్దంగా ఉన్నామని కూడ బీజేపీ ప్రకటించింది.   ఎన్నికల ఫలితాలకు ముందుగానే పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా వ్యూహలను సిద్దం చేసుకొంటున్నాయి.