ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అయితే ఈమె ఒకరోజు ముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్నది హాట్ టాపిక్‌గా మారింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలుమార్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐలు తమ ఛార్జ్‌షీట్‌లలోనూ ఆమె పేరును ప్రస్తావించాయి. అంతేకాకుండా సీబీఐ సైతం కవితను కొన్ని గంటల పాటు ప్రశ్నించాయి. అప్పుడే కవిత అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎందుకో తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. కానీ ఈడీ, సీబీఐలు తమ పని తాము చేసుకుంటూ వచ్చాయి. అయితే ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. లిక్కర్ స్కాం కేసులో సిసోడియా తర్వాత అరెస్ట్ కాబోయేది కవితేనంటూ బీజేపీ నేతలు గత కొద్దిరోజులుగా మీడియా ముందు చెబుతున్నారు. ఈ క్రమంలో నిన్న కవితకు సన్నిహితుడిగా చెబుతున్న అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. అప్పుడు కూడా కవిత పేరును రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించింది.
ఈ అరెస్ట్ జరిగి గంటలు గడవకముందే కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నెల 9వ తేదీ ఢిల్లీలో తమ ఎదుట హాజరుకావాలని కవితను నోటీసుల్లో ఆదేశించింది. అయితే ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు వుండటంతో తాను రేపు హాజరుకాలేనని మరో రోజు వస్తానని కవిత ఈడీకి లెటర్ రాశారు. దీనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. కానీ అనూహ్యంగా కవిత ఢిల్లీకి బయల్దేరడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విపక్షాలు కానీ, విమర్శకులు కానీ ఈ పరిణామాన్ని ఊహించలేకపోయారు.
ALso REad: కాంగ్రెస్ లో కవిత చిచ్చు: రేవంత్ రెడ్డిని నిలదీసిన కోమటిరెడ్డి
నోటీసులు అందిన తర్వాత కవిత ప్రగతి భవన్‌కు వెళ్తారని ప్రచారం జరిగింది. తన తండ్రి, సీఎం కేసీఆర్ సలహా తీసుకుని ఆ విధంగా నడుచుకుంటారని అంతా భావించారు. కానీ చివరికి ఆమె ఢిల్లీకి బయల్దేరారు. అయితే న్యాయ నిపుణుల సలహా మేరకే కవిత ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. విచారణకు ఈడి సమయం ఇవ్వకపోతే హాజరుకావడానికి అందుబాటులో ఉండాలని న్యాయ నిపుణులు సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే కవిత ప్రగతి భవన్‌కు కాకుండా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ఢిల్లీలో ల్యాండైన తర్వాతే కవిత ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.
మరోవైపు.. రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం వుంది. ఒకవేళ కవితను ఈడీ అరెస్ట్ చేస్తే ఏం చేయాలన్న దానిపై కేబినెట్‌లో చర్చించే అవకాశాలు వున్నాయని ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐలు దూకుడు చూపిస్తూ వుండటం.. నేరుగా తన కుమార్తెనే టార్గెట్ చేయడంతో కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడ వేస్తారోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
