కెటిఆర్ బామ్మార్ది పబ్ కు నోటీసు ఇవ్వలేదు ఎందుకు మంత్రుల బంధువుల పబ్ లను ఎందుకు వదిలిపెట్టిర్రు పెద్ద వాళ్లను వదిలేసి చిన్నా చితక వాళ్లమీదే పడ్డారు
డ్రగ్స్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరుగా సిఎం కెసిఆర్ కుటుంబంపైనే ఆరోపణలు గుప్పించారు రేవంత్. కెసిఆర్ తనయుడు, మంత్రి కెటిఆర్ కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రుల ఆధ్వర్యంలో నడుస్తున్న పబ్ లకు నోటీసులు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. పెద్ద పెద్ద వారిని వదిలేస్తున్నారని విమర్శించారు. పెద్ద వాళ్ల హస్తం ఉన్న పబ్ లకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో చెప్పాలన్నారు.
కేవలం చిన్నా చితక వారిని తీసుకొచ్చి విచారణ పేరుతో టైంపాస్ చేస్తున్నారని మండిపడ్డారు. పబ్ లన్నింటికీ నోటీసులు ఇచ్చామని గొప్పులు చెబుతున్న ఎక్సైజ్ శాఖ వారు కెటిఆర్ బంధువులు, మిత్రులు నడుపుతున్న పబ్ లకు, మంత్రుల బంధువుల పబ్స్ కు నోటీసులు ఇవ్వకపోవడంలో ఆంత్యమేంటని ప్రశ్నించారు.
మియపూర్ భూములు అన్యాక్రాంతం విషయాన్ని పక్కదోవపట్టించేందుకే డ్రగ్స్ కేసును బయటకు తెచ్చారని ఆరోపించారు రేవంత్. తెలంగాణ ప్రభుత్వ పెద్దలు శవాల మీద పేలాలు ఏరుకునే నీచుల మాదిరిలా తయారయ్యారని విమర్శించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ తక్షణమే స్పందించి కేటీర్ బావమరిది నడుపుతున్న పబ్ కు నోటీస్ ఇవ్వాలని సవాల్ విసిరారు. ఐ లైఫ్, టానిక్ పబ్ లు టీఆర్ఎస్ నేతలకు చెందినవేనని ఆరోపించారు రేవంత్.
గతంలోనే పలు పబ్ ల వ్యవహారం పై, టిఆర్ఎస్ నేతల దందాలపై పోలీస్ లకు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. హైదరాబాద్ లో డ్రగ్ మాఫియా పెచ్చరిల్లిపోతున్నప్పటికీ డిఆర్ఐ, నార్కోటిక్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థ లకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు లేఖలు రాయడం లేదని ప్రశ్నించారు.
డ్రగ్స్ పేరుతో పబ్ యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడానికే కేసులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు డ్రగ్స్ కేసును అప్పగించాలని డిమాండ్ చేశారు. కెటిఆర్ బామ్మార్ది పబ్ కు నోటీసులు ఇవ్వకపోవడం చూస్తే ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతుందన్నారు రేవంత్.
