జెఎసి కట్టడి కోసం సర్కారు సరికొత్త ఎత్తుగడ కొలువుల కై కొట్లాట ను ఎదుర్కొనేందుకు పక్కా ప్లాన్ ఒక్క దెబ్బకు రెండు పిట్టల పై కేసిఆర్ సర్కారు గురి స్పూర్తి యాత్రకు చెక్ పెట్టిన సర్కారు మరి కొలువులకై కొట్లాట సాగేనా అన్న ఉత్కంఠ

రోజు రోజుకూ తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం కేసిఆర్ సర్కారుకు కొరకరాని కొయ్యగా మారుతున్నారు. ఒకవైపు అమరుల స్పూర్తి యాత్రలో సర్కారును వత్తిడి చేస్తుండగా మరోవైపు కొలువుల కొట్లాట పేరుతో రెండు వైపులా యుద్ధం ప్రకటించారు. దీంతో తెలంగాణ సర్కారు ఆందోళనలో పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అందుకే ఎలాగైనా కోదండరాం కట్టడికి సర్కారు నడుం బిగించినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. మరి కోదండరాం కట్టడిలో తెలంగాణ సర్కారు వ్యూహం ఫలించినట్లేనా అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

తెలంగాణ జెఎసి రాజకీయ పార్టీ కాదు. కేవలం ఒక ఉద్యమ సంస్థ మాత్రమే. కానీ తెలంగాణ సర్కారు జెఎసి కార్యకలాపాలపైనే ప్రధాన దృష్టి సారించినట్లు కనబడుతున్నది. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి కేసిఆర్ విలేకరుల సమావేశంలో కోదండరాం పై తిట్ల వర్షం కురిపించారు. వ్యక్తిగత విమర్శలకు సైతం దిగారు. వాడు, వీడు అన్న భాషను ఉపయోగించి తీవ్రాతి తీవ్రంగా విరుచుకుపడ్డారు సిఎం. అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన కోదండరాం మాత్రం తనదైన భాషలోనే తిట్ల భాషకు సమాధానం చెప్పారు.

ఇక ఆరో దశ అమరుల స్పూర్తి యాత్రను సక్సెస్ ఫుల్ గా అడ్డుకోగలిగింది తెలంగాణ సర్కారు. కోదండరాం హైదరాబాద్ పొలిమేరలు దాటకముందే అరెస్టు చేసి లెక్కలేనన్ని పోలీసు స్టేషన్లకు తిప్పింది. రాత్రి వరకు హైడ్రామా క్రియేట్ చేశారు పోలీసులు. తీరా రాత్రి 7 గంటల ప్రాంతంలో కోదండరాం ను విడుదల చేశారు. దీంతో ఆరో వరంగల్ జిల్లాలో జరగాల్సిన ఆరో విడత స్పూర్తి యాత్రను కేసిఆర్ సర్కారు వ్యూహాత్మకంగా అడ్డుకోగలిగింది. హైదరాబాద్ లో, వరంగల్ జిల్లాలో కలిపి సుమారు 400 మందిని అరెస్టు చేశారు పోలీసులు. అమరుల స్పూర్తి యాత్రను అడ్డుకోగలిగారు కానీ... సర్కారుపై విమర్శలు మాత్రం గట్టిగానే మొదలయ్యాయి.

తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ వ్యూహాత్మక వైఖరి మరోసారి అవలంభించే అవకాశాలున్నాయి. ఈ నెలాఖరులో జరగనున్న కొలువులకై కొట్లాట సభను కూడా సక్సెస్ ఫుల్ గా అడ్డుకునేందుకు మావోయిస్టు వాదనను తెరపైకి తెచ్చనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నయి. చిన్నపాటి స్పూర్తి యాత్రనే అడ్డుకున్న సర్కారు బర్నింగ్ టాపిక్ అయిన నిరుద్యోగ సమస్యపై అది కూడా హైదరాబాద్ లో సభ పెడతామంటే ఒప్పుకుంటదా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టు మంత్రం తెలంగాణ సర్కారుకు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా పనికొస్తుదేమోనని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కోదండరాం ను పటిష్టంగా కట్టడి చేసేందుకే ఈ సరికొత్త అస్త్రాన్ని వదిలినట్లు చెబుతున్నారు.

కోదండరాం ను ఉత్త పుణ్యానికే అరెస్టు చేసుడేందన్న విమర్శలు అన్నివైపులా వచ్చాయి. కాంగ్రెస్, టిడిపితోపాటు ఇతర పార్టీలు కూడా కోదండరాం అరెస్టును ఖండించాయి. సర్కారు వైఖరిని ఎండగట్టాయి. అయితే సర్కారు తమను అరెస్టు చేయడం పట్ల జెఎసి కూడా తీవ్రంగానే స్పందించింది. ఈ సర్కారు జెఎసిని చూసి భయపడుతోందని అర్థమైందన్నారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. ఒక దశలో ప్రజాసామ్య పద్ధతుల్లో జెఎసి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా... సర్కారు మాత్రం ఏకపక్షంగా అరెస్టులకు పాల్పడి యాత్రను జరగకుండా అడ్డుకుందన్న మెసేజ్ జనాల్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు వ్యూహాత్మక అడుగు వేసింది.

తెలంగాణ జెఎసి వెనకాల మావోయిస్టులు ఉన్నారని, జెఎసి యాత్ర చేపడితే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని ప్రకటించింది తెలంగాణ సర్కారు. స్వయంగా హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి ఈ ప్రకటన వెలువరించడం చర్చనీయాంశమైంది. జెఎసి ప్రతినిధులను అక్రమ అరెస్టు చేశారన్న విమర్శలకు ఈ వాదన ద్వారా సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది సర్కారు.

కానీ సర్కారు ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందన్న దానిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. మరోవైపు సోషల్ మీడియాలో ప్రభుత్వ అనుకూలవాదులు కోదండరాం కాంగ్రెస్ లో చేరిపోతున్నారని, జెఎసిని ఎన్నికల ముందే కాంగ్రెస్ లో కలిపేస్తున్నారని మార్ఫింగ్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఇవన్నీ మార్ఫింగ్ పోస్టులనీ, అలాంటి పోస్టులను నమ్మరాదని జెఎసి ప్రతినిధులు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ అనుకూవాదులు చేస్తున్న ఈ సోషల్ దాడి పట్ల నెటిజన్లు సైతం తీవ్రంగానే స్పందిస్తున్నారు. జెఎసి ని ఎదుర్కొనే సత్తా లేకనే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.

మొత్తానికి తెలంగాణ సర్కారు తీసుకున్న ఈ వ్యూహం ఈనెలాఖరులో జరగనున్న కొలువులకై కొట్లాట సభను కూడా సక్సెస్ ఫుల్ గా అడ్డుకునేందుకు వినియోగించుకునే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కోదండరాం ను కట్టడి చేసేందుకే ఈ సరికొత్త అస్త్రాన్ని వదిలినట్లు చెబుతున్నారు. మరి దీన్ని జెఎసి ఎలా కౌంటర్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/fJWa5i