తెలంగాణ వాళ్ళ జాగీరా? : కేసీఆర్, కేటీఆర్ లపై కిషన్ రెడ్డి ఫైర్
Hyderabad: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి కౌంటరిచ్చారు. రాష్ట్రంలో పర్యటించే ముందు బీజేపీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకుంటుందో ప్రధాని ప్రకటించాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ లు ఏం చేశారో ముందు చెప్పాలని మండిపడ్డారు.
Kishan Reddy hits back at KTR: బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. గవర్నర్ కోటాలో శాసనమండలికి అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులు దాసోజు శ్రావణ్ కుమార్, కే సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం తిరస్కరించారు. దీంతో మరోసారి రాజ్ భవన్-సర్కారు మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్-బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఈ మాటల యుద్ధం మరింతగా ముదిరింది. ఇరు పార్టీల నేత ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ పర్యటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) పలు ప్రశ్నలు సంధిస్తూ.. రాష్ట్ర పర్యటనకు ముందు ప్రజలకు బీజేపీ ఎలాంటి హామీలు ఇవ్వనుందో ప్రధాని ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి కౌంటరిచ్చారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కేటీఆర్ లు ఏం చేశారో ముందు చెప్పాలని మండిపడ్డారు.
అక్టోబర్ 3న నిజామాబాద్ లో ప్రధాని పర్యటన ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు ముందుగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. 17 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 పరీక్షను ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు నెలవారీ ఆర్థిక సాయం పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు? దళితులకు మూడెకరాల భూమి కేటాయించడంత పాటు ఇతర పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రధాని పర్యటనను ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని పర్యటనకు షరతులా అంటూ మండిపడుతూ.. కేసీఆర్, కేటీఆర్ ఎవరు? తెలంగాణ వారి జాగీరా? అంటూ ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఏం మాట్లాడరనేది మీడియా అడగొద్దనీ, కేవలం తమ మా ప్రశ్నలకు కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "కేటీఆర్ నుంచి సర్టిఫికేట్ మాకు అక్కర్లేదు. తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. రాష్ట్రం కోసం, ప్రజల కోసం తమ వంతు కృషి చేస్తున్నామని" చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య, బీజేపీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పి.గంగారెడ్డి పాల్గొన్నారు.