Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణా, నీ ఉద్యోగాలెక్కడ తల్లీ...

శాసనసభా వేదిక మీద ముఖ్యమంత్రి వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు గడిచాక వాగ్దానం చేసిన ఒక లక్షా ఏడువేల ఉద్యోగాలలో సగం కాదు గదా, పావు వంతు కూడ పూర్తి కాలేదు.

where have the Telangana jobs gone

తెలంగాణ ఉద్యమానికి మూల కారణం నిరుద్యోగం.   నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో తమ ఉద్యోగాలకు హామీ లేదనీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమకు ఉద్యోగాలు వస్తాయనీ ఆశే విద్యార్థి యువజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొనడానికి ప్రధాన కారణం. అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పన్నెండు లక్షలు కాగా, తెలంగాణకు విస్తీర్ణం రీత్యానైనా, జనాభా రీత్యానైనా ఐదు లక్షల ఉద్యోగాలు దక్కవలసి ఉండగా రెండు, రెండున్నర లక్షల మంది తెలంగాణ బిడ్డలకు మాత్రమే పాలకులు ఉద్యోగాలు ఇచ్చారని అప్పటి వాదన. పన్నెండు లక్షల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణ బిడ్డలు 1,87,000 మంది మాత్రమేననీ, అంటే తెలంగాణకు దక్కవలసిన మూడు లక్షల ఉద్యోగాలను పాలకులు ఆంధ్ర ప్రాంతీయులకు కట్టబెట్టారనీ ఇవాళ ప్రధాన పదవిలో ఉన్న అప్పటి ఉద్యోగ నాయకులు రాశారు. ఆ అక్రమాన్ని సరిదిద్దడానికే జైభారత్‌ రెడ్డి కమిషన్‌, 610 జీవో, గిర్‌ గ్లాని కమిషన్‌ వచ్చాయని మలిదశ ఉద్యమంలో మాట్లాడని నాయకులు లేరు. 

 

ఆ నాయకులలో అత్యధికులు ఇవాళ ప్రభుత్వాధికారంలో ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు దక్కవలసిన రెండున్నర లక్షల ప్రభుత్వోద్యోగాలు అని అప్పుడు చెపుతుండిన అంకె రాష్ట్ర విభజన తర్వాత క్రమక్రమంగా కనుమరుగవుతూ వచ్చింది. 'పంచపాండవులంటే నాకు తెల్వదా, మంచం కోళ్లలాగ ముగ్గురు కాదా అని రెండు వేళ్లు చూపించి గోడ మీద ఒకటి అని రాసినట్టు' మూడు లక్షల, రెండున్నర లక్షల, రెండు లక్షల ఉద్యోగాల అంకె నానాటికీ కుంచించుకు పోయింది. చివరికి 2014 నవంబర్‌ 24న అధికారికంగా శాసనసభావేదిక మీద ముఖ్యమంత్రి ఉపన్యాసంలో 'రానున్న రెండు సంవత్సరాలలో 1,07,744 ఉద్యోగాలు ఇస్తామ'నే దగ్గర స్థిరపడింది. ఆ అంకెనే కాస్త అటూ ఇటూగా ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు గత రెండు సంవత్సరాల్లో అనేకసార్లు ప్రకటించారు.

 

 నియామకాలు జరపడానికి ప్రధాన సాధనమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను స్థాపించగా, అది కొత్త సిలబస్‌ తయారు చేసి, కొన్ని పరీక్షలు నిర్వహించింది. అది అభ్యర్థులను పరీక్షించి, నియామక ఉత్తర్వులు ఇవ్వగలదు గాని, ప్రభుత్వం అనుమతించిన, ప్రకటించిన ఖాళీలను మాత్రమే భర్తీ చేయగలదు. తాజాగా టిఎస్‌ పిఎస్‌సి అధ్యక్షులు గవర్నర్‌కు ఇచ్చిన నివేదిక ప్రకారం, కమిషన్‌ ఏర్పడిన తర్వాత గడిచిన రెండు సంవత్సరాలలో 24 నోటిఫికేషన్లు ఇచ్చామని, మొత్తం 4,295 ఉద్యోగ నియామకాలు చేశామని, మరో 1,645 నియామకాల ప్రక్రియ సాగుతున్నదని, రానున్న సంవత్సరంలో మరో 9,342 ఉద్యోగాలకు ప్రభుత్వ అనుమతి వచ్చిందని తెలుస్తున్నది. అంటే అన్నీ కలిపినా పదిహేను వేల ఉద్యోగాలు. ఇవి కాక, పోలీసుల, ఉపాధ్యాయుల ఉద్యోగాలు మరొక పది, పదిహేను వేలు నియామక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

where have the Telangana jobs gone

శాసనసభా వేదిక మీద ముఖ్యమంత్రి వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు గడిచాక అన్నీ కలిపి చూసినా, వాగ్దానం చేసిన ఒక లక్షా ఏడువేల ఉద్యోగాలలో సగం కాదు గదా, పావు వంతు కూడ పూర్తి కాలేదు. గత ప్రభుత్వాలు తెలంగాణలో మూసివేసిన, కారుచౌకగా ఆశ్రితులకు కట్టబెట్టిన ప్రభుత్వరంగ సంస్థలను, పరిశ్రమలను పునరుద్ధరించి ఆ నిరుద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు కల్పించడం జరగలేదు. కొత్తగా ఉద్యోగ కల్పన కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కోసం, సొంత వనరులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కొత్తగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు స్థాపించే ఆలోచనలు లేవు. ఈ రెండు సంవత్సరాలలో కనీసం నాలుగు ప్రయివేటు, సంయుక్త రంగ పరిశ్రమలు మూతపడి, పదివేల మంది ఉద్యోగులు వీథిన పడితే, ఆ కార్మిక సంఘాల నాయకులు మంత్రులు కూడ అయి ఉండి, మూసివేతలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వీసమెత్తు ప్రయత్నాలు చేయలేదు.

 

తెలంగాణ ప్రజా ఉద్యమం ఆకాంక్షించిన ఉద్యోగాలు ఇవ్వడానికి, ఆ ఉద్యమ ఫలితంగా రూపొందిన ప్రభుత్వం తాను ఇవ్వగలిగిన, ఇవ్వవలసిన ఉద్యోగాల విషయంలో ఇటువంటి నిర్లక్ష్యం, హామీల ఉల్లంఘన సాగిస్తూనే, తన ఘనత వల్ల లక్షలాది ప్రయివేటు ఉద్యోగాలు వస్తున్నాయని గత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల లాగనే ప్రగల్బాలు పలుకుతున్నది. ప్రయివేటు ఉద్యోగాలు ఇన్ని వచ్చాయి, అన్ని వచ్చాయి అనడమే గాని, ఆ గణాంకాలలో అనుమానించవలసింది చాల ఉంటుందని దశాబ్దాల అనుభవాలు చెపుతున్నాయి. ఒకవేళ అవి నిజమే అయినా, ప్రభుత్వోద్యోగమూ ప్రయివేట్‌ ఉద్యోగమూ ఒకటి కావు. ప్రభుత్వోద్యోగంలో ఉన్న ఉద్యోగ భద్రత, గౌరవనీయమైన పనిపరిస్థితులు, విరమణానంతర సదుపాయాలు ప్రయివేట్‌ ఉద్యోగంలో ఉండవు. ప్రభుత్వోద్యోగాలలో రాజ్యాంగబద్ధంగా మహిళలకు, దళిత, ఆదివాసి, మైనారిటీ, వెనుకబడిన కులాల అభ్యర్థులకు ఉండే ప్రాధాన్యత ప్రయివేట్‌ ఉద్యోగాలలో ఉండదు.

 

ప్రయివేట్‌ ఉద్యోగం కల్పించేవారు తమ లాభాల కోసం పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటు చేస్తారు గాని సామాజిక శ్రేయస్సు కోసం, ఉద్యోగ కల్పన కోసం కాదు. మరొకచోట లాభాలు ఎక్కువ వస్తాయంటే డేరా ఎత్తుకుని, ఉద్యోగులను గాలికి వదిలి పోతారు. వారు ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడ ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు చేసే మేలుకన్న ఎక్కువ రాయితీలు, పన్ను మినహాయింపులు, భూమి, నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలన్నీ పొందుతారు. ఇక్కడి వనరులను ఇంతగా కొల్లగొట్టి, సొంత లాభాలు చేసుకునే ప్రయివేటు వ్యాపారస్తులు ఇక్కడి భూమిపుత్రులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన ఏమీ పాటించరు. అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రజలు, నిరుద్యోగ యువజనులు, విద్యార్థులు ఆకాంక్షించిన ఉద్యోగకల్పన ప్రయివేటు ఉద్యోగాల ద్వారా జరగడం అసాధ్యం. 

 

ఈ నేపథ్యంలో 2015 ఒక్క సంవత్సరంలోనే రాష్ట్రంలోకి 2,332 కొత్త పరిశ్రమలు, ఒక లక్షా యాబై ఎనిమిది వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం చెపుతున్న మాటను జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంది. ఒకవేళ ఆ అంకె నిజమే అనుకున్నా ఆ కొత్త ఉద్యోగులలో తెలంగాణ బిడ్డలు ఎందరు అని ప్రశ్నించవలసి ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఈ కొత్త ఉద్యోగాలు ఐటీ, ఐటీ ఇఎస్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫార్మా, విద్యుత్‌ రంగాలలో వచ్చాయి. ఈ నాలుగు రంగాలు కూడ శ్రమ ఆధారిత రంగాలు కావు, పెట్టుబడి ఆధారిత రంగాలు. అంటే వీటిలో పెట్టుబడి ఎక్కువ వచ్చినట్టు కనబడుతుంది గాని, ఉద్యోగ కల్పన ఎక్కువ జరగదు. నిజానికి తెలంగాణ సమాజంలో ప్రస్తుతం ఉన్న నిరుద్యోగం ఇటువంటి ఆడంబరపు, పెట్టుబడి ఆధారిత పరిశ్రమల కన్న చిన్న, మధ్యతరహా, శ్రమ ఆధారిత పరిశ్రమలను కోరుతున్నది.

 

 తెలంగాణలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉన్నదో చెప్పాలంటే, తెలంగాణ ప్రభుత్వ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రచురించిన స్టాటిస్టికల్‌ ఇయర్‌ బుక్‌ 2016 ప్రకారమే, 2014 అంతానికి రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛ్ంజిల్లో నమోదు చేసుకున్న మొత్తం నిరుద్యోగుల సంఖ్య 9,90,848. అందులో మెట్రిక్‌, ఆపైన చదివిన వారు 6,68,825. మొత్తం ఉద్యోగార్థు లలో దళితులు 2,12,498. ఆదివాసులు 1,24,889, వెనుక బడిన కులాలవారు 3,71,050. కాగా, ఆ ఇయర్‌ బుక్‌ ప్రకారమే 2014లో 1,57,264 మంది నమోదు చేసుకోగా, ఆ సంవత్సరం భర్తీ అయిన ఉద్యోగాలు 1,449. టిఎస్‌ పిఎస్‌సి దగ్గర నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య అక్టోబర్‌ 2016 నాటికే పదమూడు లక్షల అరవైఐదు వేలు. ఎన్ని ఉద్యోగాలు కావాలి? ఎన్ని వస్తున్నాయి?

 

(ప్రజాస్పందన వేదిక నుంచి పునర్ముద్రితం)

Follow Us:
Download App:
  • android
  • ios