ఒకవైపు జెఎసి ఆధ్వర్యంలో కొలువులకై కొట్లాట సభకు నిరుద్యోగులు రెడీ అవుతున్నారు. మరోవైపు డిఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోతదా అని సిఎం కేసిఆర్ మూడు రోజుల క్రితమే కుందబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తర్వాత జోనల్ వ్యవస్థపై మంత్రుల కమిటీని కూడా సర్కారు ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తారు అంటూ విద్యాశాఖ, టిఎస్సపిఎస్సీ వర్గాల నుంచి ఒక లీక్ వచ్చింది. ప్రస్తుతం ఆ లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇప్పటి వరకు అనేకసార్లు త్వరలో డిఎస్సీ, త్వరలో డిఎస్సీ అని తెలంగాణ నిరుద్యోగులను ఆశల పల్లకీలో ఊరేగిస్తూ వచ్చింది సర్కారు. అయితే రకరకాల అడ్డంకులను సర్కారే కల్పించి డిఎస్సీని ఆలస్యం చేసిందన్న ఆరోపణలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు పాలనా సౌలభ్యం కోసం చేపట్టినా ఆ కొత్త జిల్లాల ఏర్పాటే తెలంగాణ టీచర్ అభ్యర్థులకు అడ్డంకిగా మారిన పరిస్థితి ఉంది. కొత్త జిల్లాల పుణ్యమా అని డిఎస్సీ ఆలస్యమైందని సర్కారు చెబుతున్న పరిస్థితి ఉంది.

మరోవైపు సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు అవంలభిస్తున్న తీరుపై కేసు నడుస్తోంది. సుప్రీం కోర్టు కూడా సర్కారు తీరు పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉంది. తక్షణం డిఎస్సీ జరిపి ప్రభుత్వ పాఠశాలలు కాపాడాలని హెచ్చరించింది. అయినప్పటికీ ఏదో ఒక కారణం చూపుతూ తెలంగాణ సర్కారు డిఎస్సీని వాయిదా వేస్తూనే ఉన్నది. పలుమార్లు సుప్రీంకోర్టు సర్కారుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఈనెల 31వ తేదీన కొలువులకై కొట్లాట కార్యక్రమానికి జెఎసి భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. తెలంగాణ వస్తే ఒక్క దెబ్బల లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన టిఆర్ఎస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రగతిభవన్ లు కట్టుకుని, సచివాలయం మారుస్తామంటూ టైంపాస్ కార్యక్రమాలు చేపడుతున్నదని జెఎసి మండిపడుతోంది. కొలువులకై కొట్లాట కార్యక్రమాన్ని సీరియస్ గానే చేపట్టేందుకు జెఎసి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఆందోళనలో ఉన్నట్లు కనబడుతున్నది. సిఎం కేసిఆర్ మీడియా సమావేశంలో కోదండరాం పై వాడు, వీడు అంటూ పరుష పదజాలంతో దూషణకు దిగడం చూస్తే కొలువులకై కొట్లాట కాక బాగానే తగిలిందేమోనని నిరుద్యోగులు అంచనా వేస్తున్నారు.

దీనికితోడు సిఎం కేసిఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. సిఎం పర్యటనను డిఎస్సీ నిరుద్యోగులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారన్న సమాచారం ప్రభుత్వానికి ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో డిఎస్సీ అభ్యర్థులను మభ్య పెట్టేందుకే ఈరకమైన లీక్ లు మరోసారి తెరమీదకు వచ్చాయన్న ప్రచారం కూడా ఉంది. ఒకవేళ సిఎం జిల్లాల పర్యటనలో డిఎస్సీ అభ్యర్థులు నిరసన చెబితే జిల్లాల పర్యటన ద్వారా ఆశించిన ఫలితాలు రావన్న ఆందోళనతోనే ఈ తరహా ప్రచారం మొదలు పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తానికి మరోసారి తెలంగాణలో త్వరలో డిఎస్సీ అనేమాట తెర మీదకు రావడం చూసిన నిరుద్యోగులెవరూ ఈ విషయాన్ని నమ్ముతున్న పరిస్థితి అయితే లేదంటున్నారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/bJeE3b