సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు ఏమయ్యాయి ? వాటిలో కదలికేదీ ? - కల్వకుంట్ల కవిత
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ గతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలను ప్రశ్నించిందని, కానీ ఏడాదిన్నరగా ఎందుకు చలనం లేదని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య అవగాహన కుదిరిందని, అందుకే ఈడీ వారిని విచారణకు పిలవడం లేదని ఆరోపించారు.
ఈడీ గతంలో కాంగ్రెస్ ముఖ్య నేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, పవన్ బన్సల్, మల్లికార్జున్ ఖర్గేలను నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు పిలిపించిందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను కూడా విచారించిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఏ కేసు ఏమైందని, ఏడాదిన్నరగా చలనం ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య అవగాహన కుదిరినట్టు ఉందని, అందుకే ఈడీ వారిని విచారణకు పిలవడం లేదని చెప్పారు.
శుక్రవారం ఆమె వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఓ రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుందని, మరో రాష్ట్రంలో వారితోనే కొట్లాడుతుందని కవిత అన్నారు. ఓ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీతో పోరాడుతారని, మరో చోటు ఆ పార్టీతోనే సాంగత్యం చేస్తారని తెలిపారు. ఇళా వివిధ రాష్ట్రాల్లో వివిధ విధానాలు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోందని ఆమె విమర్శించారు. అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఆ రాష్ట్రంలో బిజినెస్ మెన్ గౌతమ్ అదానికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తారని అన్నారు. మిగితా రాష్ట్రాల్లో ఆయనను వ్యతిరేకిస్తారని ఆమె ఆరోపించారు.
తెలంగాణకు వచ్చే రాజకీయ టూరిస్టులను తాము స్వాగతిస్తున్నామని కల్వకుంట్ల కవిత అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యేందుకు వస్తున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు సంతోషంగా హైదరాబాద్ బిర్యానీ తినాలని సూచించారు. అలాగే వెళ్లిపోవాలని కోరారు. కానీ తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెట్టే మోసపూరిత వైఖరిని అవలంభించకూడదని తెలిపారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ 9 అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి సోనియా గాంధీ లేఖ రాశారనీ కవిత గుర్తు చేశారు. కానీ అందులో మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు ప్రతిపాదించలేదని ఆమె అన్నారు.