ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్.. కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయిపోయారా..?, లేక బీజేపీలో చేరాలని అనుకుంటున్నారా..? అనేది కొంతకాలంగా ఆసక్తిగా మారిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ మార్పుపై అసలు ఆయన డైలామాకి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక నేతగా కొనసాగిన సంగతి తెలిసిందే. రెండుసార్లు పీసీసీ చీఫ్గా పనిచేసిన డీఎస్.. దివంగత సీఎం వైఎస్సార్‌తో కలిసి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తర్వాత.. ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీఎస్ టీఆర్‌ఎస్ గూటికి చేరారు. దీంతో కేసీఆర్ ఆయనను టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభకు పంపారు.
అయితే కొన్నాళ్లకే నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ నాయకత్వం, డీఎస్‌కు మధ్య విబేధాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ స్థానిక నేతలు టీఆర్‌ఎస్ అధిష్టానాన్ని కోరారు. అయితే టీఆర్‌ఎస్ మాత్రం అధికారికంగా ఆయనపై వేటు వేయకుండా.. ఆ విషయాన్ని పక్కకు పెట్టింది. ఇతర పార్టీల్లో చేరే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ఆయనను బయటకు పంపలేదు. మరోవైపు డీఎస్ కుమారుడు అరవింద్.. బీజేపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలవడం కూడా ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితులతో టీఆర్‌ఎస్‌కు డీఎస్ దూరం పెరుగుతూ వచ్చింది. డీఎస్ టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీలో సంబంధాలు లేవనే చెప్పాలి.
అయితే గత కొంతకాలంగా డీఎస్ పార్టీ మారతారనే ప్రచారం సాగుతుంది. కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉండటంతో.. డీఎస్ కూడా బీజేపీలోకి వెళతారని వార్తలు వచ్చాయి. కానీ డీఎస్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. మరోవైపు కొద్ది నెలల క్రితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్‌ను ఆయన ఇంటికివెళ్లి పరామర్శించారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి డీఎస్ చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్ నుంచి ఉన్న రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది జూన్ మొదటి వారంతో ముగియనుండటంతో.. పార్టీ మార్పుపై డీఎస్ ఏదో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే ఇటు బీజేపీ నుంచి డీఎస్‌కు ఆహ్వానం ఉండటం.. మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం ఉన్నప్పటికీ అటువైపు నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో డీఎస్ డైలామాలో ఉన్నారని సమాచారం. కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న డీఎస్ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలోనే పార్టీలో చేరాలనే ఆసక్తితో వారితో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఏఐసీసీ నాయకత్వం బిజీగా ఉండడంతో జనవరి చివరి వారం, ఫిబ్రవరి మొదటి వారంలో ఆయనకు అపాయింట్‌మెంట్ లభించలేదు.
ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వస్తుందని, స్థానిక కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఆహ్వానం వస్తుందని డీఎస్ ఆశించారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల పూర్తి అయిన తర్వాత ఆయనకు ఎటువంటి పిలుపు రాలేదు. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని డీఎస్ తిరిగి కాంగ్రెస్‌లో చేరడంపై పునరాలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు ద్వారా తెలిసింది.
డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలోనే డీఎస్‌ను కాషాయ కండువా కప్పుకునేలా చేసేందుకు బీజేపీ నాయకులు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. డీఎస్‌ను బీజేపీలో తీసుకొచ్చే బాధ్యతను అరవింద్‌కు అప్పగించినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో తనకు రాజ్యసభ బెర్త్ ఖాయమైతేనే బీజేపీలో చేరే విషయాన్ని పరిశీలిస్తానని డీఎస్ చెప్పినట్లు సమాచారం.
