పెళ్లి కొడుకు స్నేహితులకు చికెన్ వడ్డించలేదని ఆగిపోయిన పెళ్లి.. !
వివాహ విందులో చికెన్ వండించలేదని ఓ పెళ్లి ఆగిన ఘటన హైదరాబాద్ లోని షాపూర్ నగర్ లో జరిగింది.
హైదరాబాద్ : పీటల మీద పెళ్లి ఆగి పోవడానికి చిన్న చిన్న విషయాలు కూడా కారణాలుగా మారుతున్నాయి. నేటి కాలంలోనూ పెళ్ళికొడుకు తరఫువారు.. వధువు తరఫు వారిని మర్యాదల పేరుతో రకరకాలుగా వేధించడం అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. కట్నం సమయానికి అందలేదనో, సరిపోలేదనో... అమ్మాయికో, అబ్బాయికో ప్రేమ వ్యవహారం ఉందని చివరి నిమిషంలో తెలియడం వల్లనో పెళ్లిళ్లు ఆగిపోతాయి. కానీ చికెన్ వండలేదని ఓ పెళ్లి ఆగిపోయింది. అదీ విచిత్రం...
నాలుగైదు దశాబ్దాల కిందట ఊర్లలో మాంసం కూర వడ్డంచలేదని, అందులో నల్లిబొక్క రాలేదని పెళ్లిళ్లు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయిన ఘటనలు మన పెద్ద వాళ్ళు చెబుతుంటే వింటుంటాం. కానీ, ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా కనిపించడం.. అది కూడా..హైదరాబాదు లాంటి మహానగరంలో జరగడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పెళ్ళికొడుకు స్నేహితులకు భోజనంలో చికెన్ వడ్డించలేదని ఓ పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ షాపూర్ నగర్ లో సోమవారం తెల్లవారుజామున జరిగింది. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీకి చెందిన వరుడు, కుత్బుల్లాపూర్ కు చెందిన వధువుకు సోమవారం తెల్లవారుజామున వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ మిసైల్ హబ్ ఆఫ్ ఇండియా.. రక్షణ పెట్టుబడులకు అనుకూలం.. : మంత్రి కేటీఆర్
షాపూర్ నగర్లోని ఓ పంక్షన్ హాల్లో ఈ సందర్భంగా ఆదివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఆడపెళ్లి వారు బీహార్ కు చెందిన మార్వాడి కుటుంబీకులు కావడంతో శాకాహార వంటలు చేశారు. విందు ముగింపు దశలో పెళ్లి కుమారుడి మిత్రులు భోజనానికి వచ్చారు. చికెన్ ఎందుకు పెట్టలేదని గొడవపడి, తినకుండా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య గొడవ జరిగి.. వివాహం ఆగిపోయింది. వెంటనే పెళ్లి కుమార్తె కుటుంబీకులు జీడిమెట్ల సీఐ పవన్ ను కలిసి, విషయం వివరించారు. ఆయన రెండు కుటుంబాల వారిని ఠాణాకు పిలిపించి, కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత ఈ నెల 30న వివాహం చేయాలని వధూవరుల కుటుంబీకులు నిర్ణయానికి వచ్చారు.
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే నిరుడు జూన్ లో ఒడిశాలో జరిగింది. పెళ్లి విందులో మటన్ కర్రీ పెట్టలేదని గొడవ పెట్టుకోవడమే కాకుండా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అంతేకాదు మరుసటి రోజే మరో అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది కూడా. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో మనతిరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి వరుడితో పాటు తోడు పెళ్లి కొడుకు, ఇతర బంధువులు హాజరయ్యారు. అయితే.. ఈ పెళ్లిలో మటన్ కర్రీ కావాలని తోడు పెళ్లి కొడుకు అడిగాడు. అయితే ఆ విందులో మేకమాంసం లేదు.
ఆ విషయం వధువు బంధువులు చెప్పగానే.. వరుడి తరఫు వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. చివరికి పెళ్లికొడుకు పెళ్లి రద్దుచేసుకునే దాకా వెళ్లింది. వరుడు పెళ్లి క్యాన్సిల్ చేసి తన వారితో కలిసి బయటకు వచ్చేశాడు. అక్కడ్నుండి వరుడు, అతని బంధువులు అదే జిల్లలోని కుహికా పంచాయతీ పరిధిలోని గాంధపాలం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. ఆ మరుసటి రోజే తమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫులాజారా ప్రాంతానికి చెందిన మరో యువతిని వరుడు పెళ్లి చేసుకున్నాడు.