హైదరాబాద్ మిసైల్ హబ్ ఆఫ్ ఇండియా.. రక్షణ పెట్టుబడులకు అనుకూలం.. : మంత్రి కేటీఆర్
Hyderabad: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్ఐడీఎమ్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ కంపెనీల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రక్షణ తయారీలో ఉన్న అవకాశాలను వివరించారు.
Hyderabad is the missile hub of India: హైదరాబాద్‌ను మిసైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పేర్కొంటూ, రక్షణ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతం అని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. సోమవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ మాన్యుఫాక్చరర్స్ (ఎస్ఐడీఎమ్) సంయుక్తంగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ కంపెనీల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రక్షణ తయారీలో ఉన్న అవకాశాలను వివరించారు.
దేశంలోనే అతిపెద్ద రక్షణ పర్యావరణ వ్యవస్థ కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని కేటీఆర్ అన్నారు. రక్షణ పర్యావరణ వ్యవస్థ గత ఏడు సంవత్సరాలలో భారీగా విస్తరించిందని చెప్పారు. డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలలో 1,000 కంటే ఎక్కువ MSMEలు స్థానికంగా పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో రక్షణ పరిశోధన, అభివృద్ధి రంగం చాలా ముఖ్యమైనదనీ, హైదరాబాద్‌ను మిసైల్ హబ్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారని పేర్కొన్నారు. DRDO, BELL, HAL వంటి రక్షణ రంగంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు హైదరాబాద్ మహా నగరంలో ఉన్నాయనే విషయాలను గుర్తు చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. "అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ అనేక ఇతర దేశాలకు చెందిన ప్రముఖ OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు) కంపెనీలు ఒకే చోట భారీగా పెట్టుబడులు పెట్టిన నగరం ప్రపంచంలో మరెక్కడా లేకపోవటంలో ఆశ్చర్యం లేదు. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ వంటి కంపెనీలు , GE, Safran, ఇతర ప్రసిద్ధ రక్షణ మరియు ఏరోస్పేస్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని" తెలిపారు. అంతరిక్షం, రక్షణ రంగాన్ని ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తించిందని మంత్రి తెలిపారు. పెట్టుబడులను సాధించేందుకు అవసరమైన పరిపాలనా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వ TSIPASS విధానం, హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, నిరంతరాయంగా 24 గంటల పారిశ్రామిక విద్యుత్ సరఫరా తమ పెట్టుబడి ప్రణాళికలను పరిగణలోకి తీసుకోవాలని రక్షణ కంపెనీల ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
బోయింగ్ కంపెనీ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లు, కేంద్ర ప్రభుత్వం కూడా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐడెక్స్ వంటి ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్‌లను చేపడుతున్నాయని కేటీఆర్ చెప్పారు. ఇబ్రహీంపట్నంలో TSIIC స్థాపించిన ఆదిభట్ల, నాదర్‌గుల్, జీఎంఆర్ ఏరోస్పేస్, హార్డ్‌వేర్ పార్క్, ఈ-సిటీ, ఇండస్ట్రియల్ పార్క్ వంటి ప్రత్యేకమైన ఏరోస్పేస్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ పార్క్‌లు రాష్ట్రంలో ఉన్నాయి. తెలంగాణకు వచ్చే పెట్టుబడి సంస్థలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.