కరోనాను ఎదుర్కొవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం వనస్థలిపురంలోని ఏరియా హాస్పిటల్‌లో 100 బెడ్స్ స్పెషల్ వార్డ్, ఆక్సిజన్ ప్లాంట్స్, 12 బెడ్స్ ఐసీయూ వార్డ్ లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బెడ్స్‌ను పెంచుతున్నామని చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగానే బెడ్స్ పెంచుతున్నామని అన్నారు. వనస్థలిపురంలో ఈ రోజు అందుబాటులోకి వచ్చిన బెడ్స్‌తో కలిపి మొత్తం 220 బెడ్స్ అయ్యాయని చెప్పారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో 12 బెడ్స్ ఐసీయూ వార్డ్, ఇన్ఫోసిస్ సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్ ను ప్రారంభించామని తెలిపారు.
కరోనా రెండో వేవ్ వచ్చిన సమయంలోనే హైదరాబాద్ సిటీ పరిధిలో అదనపు బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే 1600 బెడ్స్ పెంచాలని తెలిపారని చెప్పారు. అందులో భాగంగా నీలోఫర్ హాస్పిటల్‌లో 800 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మరి కొన్ని హాస్పిటల్‌లో 100 బెడ్స్ చొప్పున ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.
హైద్రాబాద్‌లో మరో చైనా కంపెనీ మోసం: ముగ్గురు అరెస్ట్
అందుబాటులో మెడిసిన్, ఆక్సిజన్ సిలెండర్స్..
ముందస్తు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుందని అన్నారు. ఇప్పటి వరకు 21 లక్షలు హోమ్ ఐసోలాషన్ కిట్లు రెడీ చేసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు అవసరమైన మెడిసిన్స్, ఆక్సిజన్ సిలెండర్స్ అందుబాటులో ఉంచుకున్నామని అన్నారు. దేశంలో వైద్యంపై తెలంగాణ రాష్ట్రం అధికంగా ఖర్చు పెడుతోందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిందని తెలిపారు. పేదలకు అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు. పండ్ల మార్కెట్ వద్ద 1000 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రానుందని అన్నారు. ఈ హాస్పిటల్ కోసం స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న బస్తీ దవఖానాలు ఇతర ఏ రాష్ట్రాల్లో లేవని అన్నారు. ఈ హాస్పిటల్స్ దేశానికే ఆదర్శమని చెప్పారు. కేవలం ఈ బస్తీ దవఖానాలు హైదరాబాద్ పరిధిలోనే అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే అన్ని మున్సిపాలిటీల్లోనూ వీటిని ప్రారంభిస్తామని అన్నారు.
‘అడుక్కోవడానికి మేము బిచ్చగాళ్ళం కాదు..’ కేంద్రమంత్రి వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
ప్రజలు జాగ్రత్తలు పాటించాలి..
కరోనాను అదుపులో ఉంచడానికి ప్రజలందరూ సహకరించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని తెలిపారు. అందరూ మాస్క్‌లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెప్పారు. పండగ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. దాని ప్రభావం చాలా తక్కువ అని శాస్త్రవేత్లలు చెబుతున్నారని అన్నారు. అయినప్పటికీ అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఆందోళన చెందకూడదని అన్నారు. ప్రతీ ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అందరూ కరోనా నిబంధలు పాటించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
