తెలంగాణ బడ్జెట్: రూ. 2 లక్షల పంట రుణమాఫీ, రైతు భరోసాపై కీలక ప్రకటన
పంట రుణ మాఫీ, రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది.
హైదరాబాద్: ఎన్నికల సమయంలో రైతులకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీకి అనుగుణంగానే కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
శనివారం నాడు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఇవాళ ప్రవేశ పెట్టారు. పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ పథకాన్ని అమలు చేయనున్నామన్నారు.ఈ పథకం అమలు చేయడానికి విధి విధానాలను రూపొందిస్తున్నట్టుగా బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.ప్రతి పంటకు మద్దతు ధర కూడ అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం రైతుబంధు పథకం పేరుతో అందించిన సహాయం అర్హుల కంటే అనర్హులకు ఎక్కువగా ప్రయోజనం పొందారని కాంగ్రెస్ సర్కార్ అభిప్రాయపడింది. రైతుబంధు నిబంధనలను పున:సమీక్ష చేయనున్నట్టుగా ప్రభుత్వం తేల్చి చెప్పింది. అర్హుల విషయంలో నిబంధనలను మార్చనుంది. సాగు చేయని భూములకు గత సర్కార్ రైతుబంధు కింద నిధులను విడుదల చేసింది. దీంతో తమ ప్రభుత్వం వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడి సహాయం అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా మార్గదర్శకాలను విడుదల చేయనుంది.ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క గుర్తు చేశారు.
also read:తెలంగాణ బడ్జెట్ 2024: ఆరు గ్యారంటీలకు రూ.53, 196 కోట్లు
ప్రతి ఎకరాకు రూ. 15 వేలను పెట్టుబడి సహాయంగా అందించనున్నట్టుగా భట్టి విక్రమార్క ప్రకటించారు.కౌలు రైతులకు కూడ రైతు భరోసా కింద సహాయం చేయడానికి మార్గదర్శకాలు తయారు చేస్తున్నట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు. నకిలీ విత్తనాలకు చెక్ పెట్టే విధంగా కొత్త విత్తన విధానాన్ని తీసుకురానున్నట్టుగా ఆయన చెప్పారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు రూ. 19, 746 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టుగా మంత్రి ప్రకటించారు.