తెలంగాణలో బీజేపీదే అధికారం: ఆదిలాబాద్ సభలో అమిత్ షా
డిసెంబర్ 3న తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా ధీమాను వ్యక్తం చేశారు. ఇవాళ ఆదిలాబాద్ లో జరిగిన సభలో అమిత్ షా పాల్గొన్నారు.
ఆదిలాబాద్: డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రానుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధీమాను వ్యక్తం చేశారుఆదిలాబాద్ లో మంగళవారంనాడు బీజేపీ నిర్వహించిన జనగర్జన సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.పవిత్ర భూమిగా పేరొందిన ఆదిలాబాద్ కు వచ్చానని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.కుమరం భీమ్ పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయన్నారు. కొమురంభీమ్ ను స్మరించుకుంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించనున్నట్టుగా అమిత్ షా పేర్కొన్నారు.రజాకార్లపై పోరాడిన వీరభూమికి నమస్కారం చేస్తున్నానన్నారు.
బీజేపీని గెలిపించి కేసీఆర్ ను గద్దెదింపాలని అమిత్ షా తెలంగాణ ప్రజలను కోరారు. మనం ఇక్కడ నినదిస్తే హైద్రాబాద్ లో ఉన్న కేసీఆర్ కు వినపడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.
తెలంగాణలో ట్రైబల్ యూనివర్శిటీని మోడీ సర్కార్ ఏర్పాటు చేయనుందన్నారు. కేసీఆర్ సర్కార్ వైఖరి కారణంగానే గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు ఆలస్యమైందని అమిత్ షా చెప్పారు.పసుపు రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ కూడ మోడీ సర్కార్ ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేశారు.
ఆత్మహత్యల్లో, నిరుద్యోగంలో తెలంగాణను కేసీఆర్ నెంబర్ వన్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు.అవినీతి, కుంభకోణాల్లో తెలంగాణను నెంబర్ వన్ చేశారన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనంలో రైతులు, పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు.పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతులు, పేదలకు ఏం ఒరిగిందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. తెలంగాణలో అధికారం బీఆర్ఎస్ చేతుల్లో ఉన్నా .... మజ్లిసే నడిపిస్తుందన్నారు. దళితులు, గిరిజనులకు కేసీఆర్ ఏమైనా చేశారా అని అమిత్ షా ప్రశ్నించారు. ఆదిలాబాద్ ఆదీవాసీల కోసం కేసీఆర్ ఏం చేశారని ఆయన అడిగారు. రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తానని కేసీఆర్ ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటారన్నారు.ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని అమిత్ షా విమర్శించారు.
also read:ఆదిలాబాద్ కు చేరుకున్న అమిత్ షా: ఎన్నికల శంఖారావం పూరించనున్న కమలదళం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 9 ఏళ్లుగా బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేస్తుందన్నారు. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీ కొత్త బట్టలు వేసుకుని వస్తుందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ పేదల గురించి మాట్లాడుతుంది కానీ పేదల కోసం ఏం చేయదని అమిత్ షా చెప్పారు.
అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఏమి చేయలేదన్నారు.తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై అవినీతి ఆరోపణలు రాలేదని అమిత్ షా చెప్పారు. ప్రతి పేద మహిళకు మోడీ వంటగ్యాస్ సిలిండర్ ఇచ్చాడన్నారు.రైతుల ఖాతాల్లో ఏటా రూ. 6 వేల జమ చేస్తున్న విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 ఎత్తివేసి కాశ్మీర్ కు విముక్తి కల్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి శతృవులను తరిమికొట్టామన్నారు.అయోధ్యలో రామమందిరం కట్టాలా వద్దా చెప్పాలని ఆయన ప్రశ్నించారు.అడ్డంకులను అధిగమించి రామమందిరాన్ని మోడీ సర్కార్ నిర్మిస్తుందని అమిత్ షా చెప్పారు.