ఆదిలాబాద్ కు చేరుకున్న అమిత్ షా: ఎన్నికల శంఖారావం పూరించనున్న కమలదళం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ఆదిలాబాద్ లో జరిగే బీజేపీ సభలో అమిత్ షా పాల్గొంటారు.
ఆదిలాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారంనాడు మధ్యాహ్నం ఆదిలాబాద్ కు చేరుకున్నారు. నాగ్‌పూర్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో అమిత్ షా ఆదిలాబాద్ కు చేరుకున్నారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తొలిసారిగా బీజేపీ నిర్వహిస్తున్న సభ ఇదే. ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని బీజేపీ పూరించనుంది.ఈ నెల 1, 3 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన సభల్లో మోడీ పాల్గొన్నారు. వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.తెలంగాణలో ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఈ దిశగా గత కొంతకాలంగా బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమాలపై కమల దళం చర్యలు చేపట్టింది. గత మాసంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు.పార్టీ పరిస్థితిపై కేంద్ర నాయకత్వానికి నివేదిక అందించారు.అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 14 కమిటీలను బీజేపీ ఈ నెల 5వ తేదీన ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఈ కమిటీలు కసరత్తు చేయనున్నాయి.ఈ నెల రెండో వారంలో తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించనుంది.
ఆదిలాబాద్ లో నిర్వహించే సభ తర్వాత సికింద్రాబాద్ లో నిర్వహించే మేథావుల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు.