Revanth Reddy: తెలంగాణలో రైతు భరోసా కింద 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.

Revanth Reddy: రైతుల కోసం ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తేనే రైతుల జీవితాల్లో సంతోషం వస్తుందన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం పూర్తిగా రైతులకు అండగా నిలిచే చర్యలతో ముందుకు సాగుతున్నదని సీఎం స్పష్టం చేశారు. "వ్యవసాయం దండుగ కాదు.. పండుగ. రైతులను రాజులుగా చేయడమే లక్ష్యం" అని ఆయన పునరుద్ఘాటించారు.

రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతు వేదికల నుండి లక్షలాది మంది రైతులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

9 రోజుల్లో 9 వేల కోట్లు : రేవంత్ రెడ్డి

రైతు భరోసా పథకం కింద జూన్ 16న ప్రారంభించిన డబ్బు జమ ప్రక్రియను కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేసి, 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9 వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లు సీఎం తెలిపారు. ప్రతి ఎకరాకు రూ.12,000 చొప్పున 1.40 కోట్ల ఎకరాలకు ఈ సహాయం అందించామని పేర్కొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం అంకితభావంతో ఉన్నదని తెలియజేశారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వానికి రైతులు మొదటి ప్రాధాన్యత అనీ, ఆ తర్వాత మహిళలు, తెలంగాణ ఉద్యమకారులైన యువత కు ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక తక్కువ సమయంలోనే రూ.7,625 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేయగలిగామని తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో వ్యవసాయాన్ని పండుగగా మార్చుతాం అని హామీ ఇచ్చారు.

Scroll to load tweet…

రుణ మాఫీ, ధాన్యం కొనుగోలుపై కీలక వ్యాఖ్యలు

అప్పుల ఊబిలో ఉన్న 25,35,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు చెల్లించి రుణ విముక్తి కల్పించినట్లు సీఎం తెలిపారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే చెల్లింపు చేస్తూ, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడమే కాకుండా, 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి సాధించి దేశంలోనే అత్యధిక దిగుబడి ఇచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

గత 18 నెలల్లో వ్యవసాయ రంగంపై రూ.1,04,000 కోట్ల వ్యయం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఉచిత కరెంట్, డ్రిప్, స్ప్రింక్లర్‌లు, సోలార్ పంపులు, ధాన్యం కొనుగోలు వంటి అంశాలన్నీ ఉన్నాయి.

మహిళలు, యువత కోసం ప్రత్యేక పథకాలు

ప్రజా పాలనలో మహిళలకూ, యువతకూ ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం, స్కూల్ యూనిఫామ్ కుట్టించే బాధ్యత, అమ్మ ఆదర్శ పాఠశాలలు, స్వయం సహాయ సంఘాల కు మద్దతు వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పెద్ద సఖ్యలో వీరిని కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యం అని చెప్పారు.

అధికారంలోకి వచ్చిన తరువాత తొలినెల్లలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసినట్లు తెలిపారు. అలాగే ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

నీటి హక్కుల కోసం పోరాటం

తెలంగాణ నీటి హక్కుల పోరాటం రాజీ వుండదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ హక్కుల కోసం అన్ని విధాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. కేంద్రం ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే న్యాయస్థానాల్లో పోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు.

Scroll to load tweet…