Telangana Cabinet : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం లభించింది.

Telangana Cabinet : తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలపడం. ఈ కొత్త క్రీడా విధానం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది.

2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే స్పోర్ట్స్ పాలసీ ముసాయిదాపై ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, జితేందర్ రెడ్డి, శివసేనరెడ్డి లాంటి కీలక నేతలతో సీఎం సమీక్ష జరిపారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అనుసరిస్తున్న విధానాల ఆధారంగా ప్రతిపాదనలు రూపొందించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవాలు

రైతు భరోసా పథకం విజయవంతంగా పూర్తయిందని ప్రకటించిన ప్రభుత్వం.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవ సభలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. సచివాలయం ఎదురుగా సాయంత్రం 6 గంటలకు "రైతు నేస్తం" సభ నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 9 రోజుల్లో రైతులకు రూ.9 వేల కోట్లు అందజేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

Scroll to load tweet…

బనకచర్ల ప్రాజెక్టు పై తెలంగాణ వ్యూహాలు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు కేంద్రంతో చర్చలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి, సభ్యులకు పూర్తి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్‌కు సమాధానాలు

పీసీ ఘోష్ కమిషన్‌ రాసిన లేఖపై కేబినెట్ లో చర్చ జరిగింది. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఎలా ఆమోదించిందన్న అంశంపై 30వ తేదీలోగా పూర్తిగా వివరాలు సమర్పించాలని నిర్ణయించారు. మినిట్స్‌తో సహా పూర్తివివరాలను రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌కు అందించనుందని సమాచారం.

రిజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కి ఆమోదం

ప్రాంతీయ రింగ్ రోడ్డు (రిజినల్ రింగ్ రోడ్డు) సదరన్ పార్ట్ అలైన్‌మెంట్‌కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఈ నిర్ణయం కీలకమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రివర్గం చర్చ జరిపింది. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ సాగిందనీ, త్వరలో ఎన్నికలపై కార్యాచరణ ప్రకటించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

భరోసా ఫిర్యాదుల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. అలాగే, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా పరిష్కరించాలన్న నిర్ణయం తీసుకుంది. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ఇది ఒక పెద్ద ముందడుగుగా చెప్పవచ్చు.

Scroll to load tweet…

Scroll to load tweet…