హైదరాబాద్: రాష్ట్రంలో భూముల సమస్య పరిష్కారం కావాలంటే సమగ్ర సర్వేనే పరిష్కారమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. 

శుక్రవారం నాడు కొత్త రెవిన్యూ చట్టంపై సభ్యుల సందేహాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఆలస్యం కాకుండా సర్వేను పూర్తి చేయవచ్చని సీఎం చెప్పారు. సర్వే చేసేందుకు చాలా సంస్థలు ముందుకు వచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఒక్కో సంస్థకు ఒక్కో జిల్లాను కేటాయిస్తే సర్వే ఇంకా త్వరగా పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. గతంలో శాస్త్రీయంగా సర్వే జరగలేదని ఆయన గుర్తు చేశారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 87 రెవిన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయన్నారు. రెవిన్యూ సంస్కరణల్లో కొత్త రెవిన్యూ చట్టం తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు.కొత్త రెవిన్యూ ముసాయిదా బిల్లు తెచ్చేందుకు ఎంతో మంది సలహాలు,సూచనలు తీసుకొన్నామని ఆయన చెప్పారు. 

also read:వక్ఫ్ భూముల్లో లావాదేవీలు ఆటోలాక్ చేస్తాం: కేసీఆర్

ధరణి ఒక్కటే కాదు, మిగిలిన చట్టాలు అన్నీ కూడ ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది కోటి 45 లక్షల 58 వేల ఎకరాలకు రైతు బంధు పథకాన్ని వర్తింప చేసినట్టుగా చెప్పారు. ఈ విషయంలో ఏ గ్రామం నుండి చిన్న  ఫిర్యాదు కూడ రాలేదని ఆయన చెప్పారు. 

రైతు బంధుపథకం కింద 57.95 లక్షల మంది రైతులకు రూ. 7,279 కోట్లను అందించినట్టుగా ఆయన గుర్తు చేశారు.భూములు చూపకుండానే అసైన్డ్ భూముల సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. భూమి కంటే ఎక్కువ సర్టిఫికెట్లు ఇచ్చారని చెప్పారు.