హైదరాబాద్: వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా రేపటి నుండి ఆటో లాక్ చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 

శుక్రవారం నాడు కొత్త రెవిన్యూ చట్టంపై ఎమ్మెల్యేలు లేవనెత్తిన సందేహాలపై సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.1962 నుండి 2003 వరకు వక్ఫ్ భూముల సర్వేకు సంబంధించి 62 గెజిట్లు విడుదల చేశారన్నారు.

77,538 వక్ఫ్ భూమికి ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని ఆయన చెప్పారు. వక్ఫ్ భూముల సమస్యలు 30 ఏళ్లకు పైగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.సమగ్ర సర్వే చేసిన తర్వాతే వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరిగేలా చూస్తామని ఆయన ప్రకటించారు.

అప్పటివరకు వక్ఫ్ భూముల్లో లావాదేవీలు జరగకుండా ఆటో లాక్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.సర్వే జరిగిన తర్వాతే తుది నిర్ణయం తీసుకొందామని ఆయన సూచించారు. రాష్ట్రంలో 55 వేల వక్ఫ్ భూములు ఆక్రమణలో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 

తాను ఈ సభలో 30 ఏళ్లుగా ఉన్నానని... వక్ఫ్ భూముల సమస్యను తాను అప్పటి నుండి వింటున్నానని చెప్పారు. అక్బరుద్దీన్ ఓవైసీ తండ్రి సలావుద్దీన్ ఓవైసీ కూడ ఈ విషయమై మాట్లాడిన అంశాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.