Asianet News TeluguAsianet News Telugu

డీఎస్‌కు ఎదురుదెబ్బ: పార్టీలో చేర్చుకోవద్దన్నకాంగ్రెస్ నేతలు, కానీ..

 కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొనే వారిని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల సమావేశం  నిర్ణయం తీసుకొంది. అయితే పార్టీలో పదవులు అనుభవించి అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని వీడిన నేతలను పార్టీలోకి తీసుకోవద్దని కొందరు నేతలు కోరారు.

We are welcoming to join anyone in congress party says khuntia

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొనే వారిని ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల సమావేశం  నిర్ణయం తీసుకొంది. అయితే పార్టీలో పదవులు అనుభవించి అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని వీడిన నేతలను పార్టీలోకి తీసుకోవద్దని కొందరు నేతలు కోరారు. ముఖ్యంగా డీఎస్ లాంటి నేతలను  పార్టీలోకి తిరిగి తీసుకోకూడదని  కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యుల సమావేశం ఇవాళ  గాంధీభవన్‌లో జరిగింది.ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీకి  చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ కుంతియా కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయమై చర్చించారు. ఇతర పార్టీల్లో అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా  ఉన్న నేతల అంశాన్ని ప్రస్తావన వచ్చింది.ఈ సమయంలో డీఎస్ గురించి కూడ చర్చించినట్టు సమాచారం.

పార్టీ అధికారంలో ఉన్న సమయంలో  అన్ని రకాల పదవులను అనుభవించి పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత  పార్టిని వీడిన డీఎస్ లాంటి నేతలను తిరిగి పార్టీలోకి తీసుకోవద్దని కొందరు నేతలు  కుంతియాకు చెప్పారు.

అయితే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోవద్దని కూడ మరికొందరు కుంతియాకు సూచించారు. పార్టీలో  ఎవరినైనా చేర్చుకొనే సమయంలో స్థానికంగా ఉన్న నేతలకు సమాచారాన్ని  ఇవ్వాలని మరికొందరు నేతలు సూచించారు. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కె.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరడానికి  సమన్వయం లేకపోవడమే కారణంగా  మాజీ మంత్రి డీకె అరుణ చెప్పారు.

నాగం జనార్థన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొంటున్న విషయాన్ని దామోదర్ రెడ్డికి చెప్పకపోవడాన్ని నిరసిస్తూ  ఆయన పార్టీని వీడిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలను అడ్డుకోవడం సరైందికాదని  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  కుంతియా అభిప్రాయపడ్డారు.  అయితే  పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం అవసరమని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం కోసం అధిష్టానం చొరవచూపాలని  కూడ కొందరు నేతలు ఈ సమావేశంలో  ప్రస్తావించారు.  ఇదిలా ఉంటే ఈ సమావేశం జరిగే సమయంలోనే  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నారాయణపేటకు చెందిన టీఆర్ఎస్ నేత శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. మాజీ మంత్రి డీకె అరుణ శివకుమార్ ను పార్టీలోకి తీసుకొస్తున్నారని శివకుమార్ వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. శివకుమార్ ను పార్టీలోకి తీసుకోవద్దని  వారు కోరుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios