హైదరాబాద్: కార్పోరేట్ ఆసుపత్రులు కరోనా రోగుల నుండి అత్యధికంగా  ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని తెలంగాణ సీఎం హెచ్చరించారు.

కార్పోరేట్ ఆసుపత్రులు వసూలు చేసే ఫీజులపై టాస్క్ ఫోర్స్ కమిటీ  ఏర్పాటు చేస్తామన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎప్పటికప్పుడు వీటిని మానిటరింగ్ చేయనున్నట్టుగా తెలిపారు.సీనియర్ ఐఎఎస్ అధికారి నేతృత్వంలో కమిటిని ఏర్పాటు ఇవాళ సాయంత్రమే ఏర్పాాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

కరోనా సమయంలో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేయడం ధర్మం కాదన్నారు. ప్రతి వారం ఏ ఆసుపత్రిపై ఏం చర్యలు తీసుకొన్నామో.. ప్రతి పార్టీకి పంపాలని సీఎం ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు.

శవాలను ఆసుపత్రుల్లోనే ఉంచుకొని డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ ఆసుపత్రులు ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.కరోనా మరణాలను కూడ రాజకీయం చేయడంపై విపక్షాలపై కేసీఆర్ మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో పరిశీలిస్తామని ఆయన చెప్పారు.

బుధవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కరోనా విషయమై ఆయన ప్రసంగించారు. కరోనాతో మరణించిన వారి సంఖ్యను దాచిపెడతారా.. అని ఆయన ప్రశ్నించారు. మరణాలను ప్రభుత్వం ఎక్కడైనా దాచిపెట్టే అవకాశం ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. 

చావులో కూడ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విపక్షాలపై మండిపడ్డారు.మరణాల రేటు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు..  రాష్ట్రంలో 20 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.కరోనాపై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయన్నారు.తబ్లిగ్ గురించి ఢిల్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది తామేనని ఆయన గుర్తు చేసుకొన్నారు.

also read:ప్రతిపక్షాల గొంతు నొక్కితే మాకేం లాభం, మా బలం మేరకు సమయమివ్వాలి: కేసీఆర్

ఆరోగ్యశ్రీ అంత పటిష్టంగా ఆయుష్మాన్‌భవ లేదన్నారు. 2 లక్షల వలస కార్మికుల్ని స్వంత గ్రామాలకు పంపినట్టుగా సీఎం చెప్పారు. ప్రజలను కాపాడేందుకు మరో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.  ఈ విషయమై అధికారులతో తాను త్వరలోనే సమావేశం కానున్నట్టుగా ఆయన చెప్పారు. 

వైద్య రంగంలో నిధులను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టుగా ఆయన చెప్పారు. అన్‌లాక్ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రికవరీ మెరుగుగా ఉందన్నారు. కరోనా విషయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు చేసిన కరోనా వారియర్స్ కు అదనపు జీతం ఇచ్చి ప్రోత్సహించినట్టుగా ఆయన చెప్పారు.

కరోనా మన నియంత్రణలోనే ఉంది.. ఆందోళనలతో ఆగమాగం కావాల్సిన అవసరం లేదన్నారు.  కరోనాను ఎదుర్కొనేందుకు తాను నిరంతరం సమీక్షలు చేస్తూనే ఉన్నానని ఆయన చెప్పారు.