హైదరాబాద్:ప్రతిపక్షాల గొంతు నొక్కితే తమకు వచ్చే లాభం ఏముందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. మీ గొంతు చిన్నగా అయింది.. దానికి తామేం ఏం  చేస్తామన్నారు. 

బుధవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కరోనాపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు..తమ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్యను బట్టి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు కూడ సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరారు. తమ పార్టీకి అసెంబ్లీలో 100 మంది సభ్యులున్నారు. అసెంబ్లీలో తమ పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య ఆధారంగా తమ పార్టీ ఎమ్మెల్యేలకు సమయాన్ని కేటాయించాలని సీఎం కేసీఆర్ కోరారు.

విపక్ష పార్టీల సభ్యులకు సంఖ్యను బట్టి ఎలా సమయాన్ని కేటాయిస్తున్నారో... తమ పార్టీ సభ్యులకు కూడ సమయాన్ని కేటాయించాలన్నారు. గతంలో తాను టీఆర్ఎస్ తరపున ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఈ సభలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.

also read:అక్బరుద్దీన్, కేసీఆర్ మధ్య మాటల యుద్ధం: అసహనంతో ప్రసంగం ముగించిన ఓవైసీ

 ఆ సమయంలో జరిగిన బీఏసీ సమావేశంలో తనకు ఏదైనా అంశంపై మాట్లాడే అవకాశం ఇస్తారా అని అడిగితే... మొత్తం శాసనసభలో 15 నిమిషాలు కేటాయిస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పిందన్నారు. దాని ప్రకారంగానే తాను ఒక్క సబ్జెక్టుకు పరిమితమై ప్రసంగించినట్టుగా చెప్పారు. సభలో సమయాన్ని కేటాయించాలని అరిచి గోల చేస్తే ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. శాసనసభ రూల్స్ ప్రకారంగా సభలో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల సోలిపేట రామలింగారెడ్డి మరణంపై జరిగిన చర్చలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం దక్కలేదన్నారు. ఈ విషయాన్ని వారంతా తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. అసెంబ్లీలో మాట్లాడకపోతే తమ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రజలు అనుకొనే ప్రమాదం కూడ ఉందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తమ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా సమయాన్ని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.