టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను సేకరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు.
హైదరాబాద్: టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి వివరాలను సేకరిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేల అవినీతిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకొన్నామన్నారు. మిగిలినవారి గురించి కూడ సమాచారం సేకరిస్తున్నామని ఆయన ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమకారులకు బీజేపీ మంచి వేదికగా ఉంటుందని ఆయన చెప్పారు. కేసీఆర్ ను వ్యతిరేకించేవారికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. మరో వారం రోజుల్లో ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారని ఆయన ప్రకటించారు. ఎలాంటి హామీలు లేకుండానే రాజేందర్ బీజేపీలో చేరుతున్నారని ఆయన వివరించారు.
also read:బీజేపీ అగ్రనేతలతో ఈటల వరుస భేటీలు: నేడు హైద్రాబాద్‌కు తిరిగి రాక
బీజేపీలో ఎవరూ చేరినా కూడ ఎలాంటి హామీలుండవన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరలోనే బీజేపీలో చేరనున్నారు. ఈ విషయమై ఆయన బీజేపీ జాతీయ నాయకులతో చర్చిస్తున్నారు. సోమవారం నాడు ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ రాత్రికి ఈటల ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ తో పాటు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడ బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరే విషయమై ఈటల రాజేందర్ తన అనుచరులతో ఇదివరకే చర్చించారు.
