వరంగల్ భద్రకాళి చెరువుకు గండి.. భయాందోళనలో స్థానికులు..
వరంగల్‌కు మరో ప్రమాదం పొంచి ఉంది. భద్రకాళి చెరువుకు గండి పడింది. వర్షాలు తగ్గినప్పటికీ.. భద్రకాళి చెరువుకు భారీగా వరద రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో వరంగల్ నగరంలోని అనేక ప్రాంతాలు చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే వర్షం కొంత గ్యాప్ ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వరంగల్‌కు మరో ప్రమాదం పొంచి ఉంది. భద్రకాళి చెరువుకు గండి పడింది. వర్షాలు తగ్గినప్పటికీ.. ఎగువ ప్రాంతం నుంచి భద్రకాళి చెరువుకు భారీగా వరద రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోతననగర్ వైపు కట్ట కోతకు గురైంది. దీంతో పోతననగర్, సరస్వతి నగర్, భద్రకాళి ఆలయ పరిసన ప్రాంత వాసులు భయాందోళన చెందతున్నారు.
అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు భద్రకాళి చెరువు నుంచి వస్తున్న నీటిని దారి మళ్లించి.. దిగువ ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దీంతో దిగువ ప్రాంత కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.అలాగే గండి పూడ్చే పనికోసం సిబ్బందిని అక్కడికి తరలిస్తున్నారు.