మరికొద్ది రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానుంది. ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి ప్రజలు తండోప తండాలుగా తరలివస్తూ ఉంటారు. కాగా...భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దానిని క్యాష్ చేసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు ధరలను బాగా పెంచేసింది.

ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలిస్తుంటారు. గతేడాది ఆర్టీసీ కార్మికులు సమ్మె విచారించాక, టికెట్ ధరలు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. మేడారం టికెట్ల రేట్లు కూడా పెరిగిపోయాయి.

AlsoRead లంచం తీసుకుంటూ దొరికిపోయిన జూబ్లీహిల్స్ ఎస్ఐ... పరారీలో సీఐ...

మేడారాం గ్రామం వరంగల్ జిల్లా కేంద్రానికి 110కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సారి జాతరకు మొత్తం 4వేల బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో ముఖ్యంగా వరంగల్ రీజియన్ నుంచి అత్యధికంగా 2,250 కరీంనగర్ నుంచి 600 బస్సులు, ఖమ్మం నుంచి 400, ఆదిలాబాద్ నుంచి 300, నిజామాబాద్ నుంచి 250, హైదరాబాద్ నుంచి 200 బస్సులు జాతర కోసం నడపాలని నిర్ణయం తీసుకున్నారు.

మొత్తంగా 12వేల మంది సిబ్బంది... ఈ జాతర వేళ ఆర్టీసీ సేవలు అందించనున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి మేడారానికి వెళ్లడానికి  ఏసీ బస్సు ఛార్జీ రూ.710కి పెంచారు. సూపర్ లగ్జరీ ఛార్జ్ రూ.550, ఎక్స్ ప్రెస్ ఛార్జీ అయితే రూ.440 వసూలు చేయనున్నారు. గతేడాదితో పోలిస్తే... బస్సు ఛార్జీలు బాగా పెరిగినట్లు తెలుస్తోంది.