తెలంగాణ పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని వరంగల్ పోలీసులు ఛేదించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను డ్యామేజ్ చేసేందుకే నిందితులు ఇలా చేశారని సీపీ వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన తెలంగాణ పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని వరంగల్ పోలీసులు ఛేదించారు. స్నేహితుడి కోసం 16 ఏళ్ల బాలుడు ఈ నేరానికి పాల్పడినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాకు వివరించారు. బాలుడిని అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. కిటికీ పక్కనే పరీక్ష రాస్తున్న విద్యార్ధి నుంచి హిందీ పరీక్షా పత్రాన్ని బాలుడు ఫోటో తీసుకున్నాడని సీపీ తెలిపారు. అనంతరం ఆ ప్రశ్నాపత్రం ఫోటోను తన సీనియర్ శివగణేష్‌కు నిందితుడు పంపాడని సీపీ పేర్కొన్నారు. 

తర్వాత శివ గణేష్ క్వశ్చన్ పేపర్ ను ప్రశాంత్ అనే మరో వ్యక్తికి వాట్సాప్ లో పంపాడని ఆయన తెలిపారు. టెన్త్ పేపర్ లీక్ అంటూ మెసేజ్ తయారు చేసి వివిధ గ్రూపులలో వేశాడు ప్రశాంత్. అలాగే ఉదయం 11.24కు బండి సంజయ్‌కి పేపర్ చేరిందని సీపీ చెప్పారు. ప్రశాంత్ 2 గంటల వ్యవధిలో 142 ఫోన్లు చేశాడని ఆయన వెల్లడించారు. ఇది పేపర్ లీక్ కాదని.. కాపీయింగ్ కోసమే జరిగిందని రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సెక్షన్ ఐదు కింద కేసు నమోదు చేశామన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను డ్యామేజ్ చేసేందుకే నిందితులు ఇలా చేశారని సీపీ వెల్లడించారు. ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకే ఈ కుట్రపన్నారని రంగనాథ్ తెలిపారు. రాష్ట్రంలో పరీక్షల వ్యవస్థ సరిగా లేదని చెప్పడానికే ఇలా చేశారని సీపీ పేర్కొన్నారు.