ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూశారు. ఆదివారం ఆమె ఆరోగ్యం అత్యంత విషమించడంతో వైద్యులు ప్రీతిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే రాత్రి 9.10 గంటలకు ప్రీతి మరణించినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. 

ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూశారు. ఈ మేరకు నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన ఆమె చివరికి అలసిపోయారు. ప్రీతిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ కావడం, ఎక్మో సపోర్టుతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శుక్రవారం సీపీఆర్ నిర్వహించి గుండె పనితీరును మెరుగుపరిచారు. అయితే ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమించింది. ఈ క్రమంలో రాత్రి 9.10 గంటలకు ప్రీతి మరణించినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఆమెను అన్ని రకాలుగా బతికించేందుకు ప్రయత్నించామని.. కానీ కాపాడలేకపోయామని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. 

ALso REad: ప్రైవేట్ ఆసుపత్రికి పంపాలి గానీ.. నిమ్స్‌కే ఎందుకు , ఠాగూర్ సినిమా లెక్క వుంది : ప్రీతి బాబాయ్ సంచలనం

అంతకుముందు ఆమె తండ్రి మాట్లాడుతూ.. తన బిడ్డ బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని ప్రీతి తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఇది ముమ్మాటికీ హత్యేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైఫ్‌ను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ రోజు ఉదయం 4.30కి ఘటన జరిగితే 8 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆయన ఆరోపించారు. ప్రీతి మొబైల్స్‌లో వాళ్లకు కావాల్సినట్లు సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారని ప్రీతి తండ్రి వ్యాఖ్యానించారు.

జనగామ జిల్లాకు చెందిన ప్రీతి.. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ (అనస్థీషియా) చదువుతోంది. మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో ఉదయం 6:30 గంటల ప్రాంతంలో విషపూరిత ఇంజక్షన్‌ వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ప్రీతిని అపస్మారక స్థితిలో ఉండటం గమనించిన ఆసుపత్రి సిబ్బంది సీనియర్ వైద్యులక సమాచారం అందించారు. వారు ఆమెను అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. 

ALso REad: మెడికో ప్రీతి కేసు .. నా బిడ్డ బతకదంటున్నారు : కన్నీటి పర్యంతమైన తండ్రి

ఇక, సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నంచినట్టుగా పోలీసులు గుర్తించారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. శుక్రవారం సైఫ్‌ను హన్మకొండలోని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం సైఫ్‌ను ఖమ్మం జైలుకు తరలించారు.