ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలి: బండి సంజయ్ కు వరంగల్ పోలీసుల నోటీసులు

ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు ఇచ్చారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాదయాత్రను నిలిపివేయాలని ఆ నోటీసులు కోరారు పోలీసులు. 

Warangal District Police Issues Notice to BJP Telangana president Bandi Sanjay

హైదరాబాద్: ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరంగల్ పోలీసులు మంగళవారం నాడు నోటీసులు పంపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు పంపారు. పాదయాత్రలో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ యాత్ర ఇలానే కొనసాగితే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి. కవిత ఇంటి ముందు ధర్నాకు నిన్న బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దీంతో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తాను బస చేసిన చోటునే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి బండి సంజయ్ ను కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. అయితే తాను ఎక్కడ పాదయాత్ర నిలిపివేశానో అక్కడి నుండే పాదయాత్రను ప్రారంభిస్తానని కూడా కరీంనగర్ లో బండి సంజయ్ ప్రకటించారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర చేసే రూట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున పాదయాత్రను విరమించుకోవాలని కూడా ఆ లేఖలో ఏసీపీ బండి సంజయ్ ను కోరారు. పాదయాత్రను ఇక్కడే విరమించుకోవాలని కోరారు.

also read:కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతరును సస్పెండ్ చేయాలి: బండి సంజయ్

ఈ నెల 2వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాత్ర సాగుతుంది. భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు యాత్రను కొనసాగించాలని యాత్ర రూట్ మ్యాప్ ను సిద్దం చేశారు. అయితే టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ యాత్రను నిలిపివేయాలని ఆ నోటీసులో ఏసీపీ కోరారు. అయితే తాము తొలుత నిర్ణయించుకొన్నట్టుగానే భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగిస్తామని  బీజేపీ నేతలు ప్రకటించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios