Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతరును సస్పెండ్ చేయాలి: బండి సంజయ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కూతురిని కాపాడుకునేందుకు ప్రజా సంగ్రామ పాదయాత్ర అడ్డుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.  లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు యాత్రను అడ్డుకున్నారని విమర్శించారు. 

bandi sanjay demand kcr to suspend his daughter kavitha over Delhi liquor scam Allegations
Author
First Published Aug 23, 2022, 2:43 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కూతురిని కాపాడుకునేందుకు ప్రజా సంగ్రామ పాదయాత్ర అడ్డుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుందని చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ నుంచి దృష్టి మరల్చేందుకు యాత్రను అడ్డుకున్నారని విమర్శించారు.  ఈరోజు ఉదయం జనగామ జిల్లాలో బండి సంజయ్‌ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.    

తెలంగాణలో బీజేపీ పెట్టుకున్న సభ విజయవంతమైందని చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్రను ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు. పాదయాత్రపై దాడి చేస్తే ప్రజలు బడిత పూజ చేస్తారని అన్నారు. తమ కార్యకర్తలపై రాళ్లు వేస్తున్నా.. వాళ్లు ఎక్కడ భయపడలేదని చెప్పారు. 

కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతురు కవితను సస్పెండ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కూతురుకు ఓ న్యాయం, ఇతరులకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. ఇన్ని రోజులుగా పాదయాత్ర సాగుతుంటే.. ఇప్పుడే సమస్య ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ రోజే తమ పాదయాత్రను అడ్డుకోవడానికి కారణం ఏమిటో చెప్పాలని అడిగారు. 

ఎక్కడ పాదయాత్రను ఆపారో.. అక్కడి నుంచే పాదయాత్రను ప్రారంభిస్తానని చెప్పారు. ఈ నెల 27వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరంగల్‌కు వస్తారని.. బహిరంగ సభ ఎట్టి పరిస్థితిలో నిర్వహించి తీరుతామని చెప్పారు. బీజేపీ పాదయాత్రను ఆపడమే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి నాంది అని అన్నారు. 


ఇక, మంగళవారం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత పాత్ర ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ కార్యకర్తలు సోమవారం హైదరాబాద్‌లోకి కవిత ఇంటి ఎదుట నిరసనకు దిగారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేవారు. వారిపై వివిధ సెక్షన కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. 

అయితే ఈ రోజు ఉదయం జనగామ జిల్లా పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద పోలీసులు బండి సంజయ్‎ను అరెస్ట్ చేశారు. ముందస్తుగా ఆయనను అరెస్ట్ చేసిన కరీంనగర్‌కు తరలించారు. అయితే బండి సంజయ్‌ను అరెస్ట్ చేస్తున్న సమయంలో.. పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios