తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతుంది. తాజాగా ఈరోజు వరంగల్‌లో హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతుండగానే ప్రశ్నపత్రాలు వాట్సాప్‌లో ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతుంది. నిన్న వికారాబాద్ జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు తెలుగు ప్రశ్నపత్రం ఫొటో తీసి వాట్సాప్‌లో మరోకరికి పంపగా.. ఈ రోజు వరంగల్‌లో హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. వాట్సాప్‌లో ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి బయటకు వెళ్లిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. బయటకు వచ్చిన పేపర్ ఈరోజుదేనని కన్‌ఫామ్ అవుతుందని చెప్పారు. అయితే పేపర్ సీరియల్ నెంబర్ కనిపించకుండా ఫొటో తీశారని తెలిపారు. ఎక్కడి నుంచి పేపర్ బయటకు వచ్చిందనే విచారణలో తెలుస్తుందని చెప్పారు. 

అయితే ఇది లీకేజ్ కాదని.. పేపర్ మాత్రం బయటకు వచ్చిందని చెప్పారు. సగం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ బయటకు వచ్చిందని తెలిపారు. దీని వల్ల లోపల పరీక్ష రాసేవాళ్లకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఈ చర్యల వల్ల విద్యార్థులకు ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయనే దానిపై కూడా విచారణ జరుపుతామని చెప్పారు. పేపర్ లీక్‌కు, పేపర్ బయటకు రావడానికి చాలా తేడా ఉందని చెప్పారు. పరీక్ష ప్రారంభానికి కంటే ముందే పేపర్ బయటకు వస్తే లీక్‌ అయిందని అంటారని తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించి సైబర్ క్రైమ్ టీమ్స్ చెక్ చేస్తున్నాయని చెప్పారు. ఉప్పల్‌ నుంచి బయటకు వచ్చిందని ప్రచారం చేస్తున్నారని.. దానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. దానిపై వెరిఫై చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇదిలా ఉంటే..తమ పరిధిలో పేపర్ లీక్ కాలేదని వరంగల్, హన్మకొండ డీఈవోలు చెప్పారు. ఈ ఘటనపై రెండు జిల్లాలకు చెందిన డీఈవోలు వరంగల్ పోలీసు కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఇక, ఉప్పల్ పరీక్షా కేంద్రం నుంచి పేపర్ బయటకు వచ్చిందనే ప్రచారం నేపథ్యంలో అక్కడ విద్యాశాఖ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.