హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  సూటిగా ఘాటు విమర్శలు చేశారు.మల్లు విక్రమార్క విమర్శలపై అంతే ఘాటుగా మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావులు స్పందించారు.  

గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క రాష్ట్ర ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు. పౌల్ట్రీ రైతులకు ఇచ్చిన మొక్కజొన్న  సబ్సిడీలో కుంభకోణం జరిగిందని  మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.

Also read:మోడీని నమ్ముకొంటే శంకరగిరిమాన్యాలే: అసెంబ్లీలో కేసీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కట్టిన ప్రాజెక్టులే  ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏ ప్రాజెక్టులు కట్టిందని ఆయన ప్రశ్నించారు. శ్రీరాం సాగర్, శ్రీశైలం లాంటి నీటి పారుదల  ప్రాజెక్టులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

మరో వైపు ఉమ్మడి రాష్ట్రంలోని  విద్యుత్ ప్రాజెక్టులు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏ ప్రాజెక్టులను నిర్మించిందో చెప్పాలని ఆయన  డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చుక్క నీరు కూడ తేలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పాలన గురించి సీఎం కేసీఆర్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు.

ఒక్క ఎమ్మార్వోను సజీవ దహనం చేసి తాను చనిపోయిన ఘటననను విక్రమార్క స్పందించారు. ఈ దాడి ప్రభుత్వంపై చేసిన దాడిగా ఆయన అభివర్ణించారు.  పంట నష్టపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

 ఈ సమయంలో  తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జోక్యం చేసుకొన్నారు. పౌల్ట్రీ రైతుల కోసం మొక్కజొన్నను సబ్సిడీలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని భట్టి చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ఎవరు ఎన్ని క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేశారనే విషయాన్ని మంత్రి లెక్కలతో సహా వివరించారు. పూర్తి  సమాచారంతో  అసెంబ్లీలో లెక్కలు చెప్పాలని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు.

మరో వైపు మల్లు భట్టి విక్రమార్క చేసిన విమర్శలకు మంత్రి హరీష్ రావు కౌంటరిచ్చారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నీలం తుఫాన్ వచ్చిన సమయంలో వరంగల్, ఖమ్మం జిల్లా రైతులకు పంట నష్టం ఇవ్వకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి చాంబర్ ముందు  ధర్నా చేసిన సమయంలో తమను తొక్కుకొంటూ కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లాడని హరీష్ రావు గుర్తు చేశారు.

చిత్తూరు జిల్లాకు సాగునీటి సరఫరా కు రూ. 8 వేల కోట్లు  కేటాయింపు విషయమై తాను ప్రశ్నిస్తే ఆనాడు కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరిచి హర్షం వ్యక్తం చేశారన్నారు.కాశేశ్వరం ప్రాజెక్టు నుండి 52 టీఎంసీల నీటిని నింపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఎల్లంపల్లితో పాటు పలు ప్రాజెక్టుల్లో నీరు నింపిన విషయాన్ని హరీష్ ప్రస్తావించారు.  కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల కోసం ఆశ పడ్డారని ఉమ్మడి రాష్ట్రంలో కూడ తాము పదవులను తృణ ప్రాయంగా వదిలేసిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.