హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ కు మధ్య మాటల యుద్ధం సాగింది. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంఐఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్ అడ్డుకొన్నారు. దీంతో అసహనంతో అక్బరుద్దీన్ ఓవైసీ తన ప్రసంగాన్ని ముగించారు.

తెలంగాణలో అసెంబ్లీలో బుధవారం నాడు ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించే సమయంలో  కరోనా  సమయంలో ప్రజలకు సేవ చేసిన కరోనా  వారియర్స్ ను తాము సెల్యూట్ చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో సెల్యూట్ చెప్పకపోయినా కూడ తాము ఆ పని చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రకటన హెల్త్ బులెటిన్ మాదిరిగా ఉందని అక్బరుద్దీన్ అబిప్రాయపడ్డారు.

ఈ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాభారతం మొత్తం చెబుతున్నారని సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా సమయంలో కరోనా వారియర్స్ కు ఇన్సెంటివ్ ను ప్రకటించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమేనని ఆయన చెప్పారు. అక్భరుద్దీన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు.

ఆ తర్వాత ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి తన  ప్రసంగించారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించలేదు.. ప్రభుత్వం చేసిన పనిని కూడ చెప్పుకోలేదన్నారు. తాను కరోనా వారియర్స్ కు సెల్యూట్ చేస్తున్నానని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించకున్నా కూడ సీఎం కి తనపై ఎందుకు కోపం వస్తోందో తనకు తెలియదన్నారు.

also read:పీవీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

ఇదే సమయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పదే పదే ప్రసంగాన్ని ముగించాలని కోరడంతో అక్బరుద్దీన్ ఓవైసీ అసహనంతో తన ప్రసంగాన్ని ముగించి సభ నుండి వెళ్లిపోయారు.

స్పీకర్ తో వాగ్వాదం

క్వశ్చన్ అవర్ లో స్పీకర్ తో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. క్వశ్చన్ అవర్ లో  సభలో మాట్లాడేందుకు తమకు సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలకు సభలో మాట్లాడేందుకు ఆరు నిమిషాల సమయం సరిపోదన్నారు.

కరోనాపై చర్చ పెట్టకుండా అనవసర అంశాలపై చర్చ పెడుతున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి తాము ప్రతి అంశంలో సహకరిస్తున్నా స్పీకర్ పై అక్బరుద్దీన్ ఓవైసీ అసహనం వ్యక్తం చేశారు. సభలో వెంటనే కరోనాపై చర్చ జరపాలని ఓవైసీ, రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టారు. ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన స్పీకర్, సభ్యుల సంఖ్య ప్రకారమే సమయం ఇస్తామన్నారు.