తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడానికి TRS ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గులాబీ బాస్ KCR.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన ప్రణాళికలను రచిస్తున్నారు. ఈ క్రమంలోనే చేయిస్తున్న కొన్ని సర్వేల్లో షాకింగ్ విషయాలు వెల్లడవుతున్నాయి.
తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడానికి TRS ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. గులాబీ బాస్ KCR.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన ప్రణాళికలను రచిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ సర్వేలు చేయిస్తున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త Prashant Kishor బృందంతో సహా మూడు వేర్వేరు ఏజెన్సీలు.. ఎమ్మెల్యేల పనితీరుపై పలు సర్వేలు చేస్తున్నాయి. అయితే ఈ సర్వేలు తుదిదశకు చేరుకన్నట్టుగా టీఆర్‌ఎస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజవర్గాలు ఉండగా.. అందులో ప్రస్తుతం 103 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంఐఎం, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్.. 88 చోట్ల గెలుపొందగా.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.
ఇక, టీఆర్‌ఎస్ సర్వే విషయానికి వస్తే.. ఎంఐఎంకు చెందిన ఏడు స్థానాలు మినహా 112 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తుది సర్వే నివేదికలు ఏప్రిల్ 15లోగా ముఖ్యమత్రి కేసీఆర్ వద్దకు చేరనున్నట్టుగా తెలుస్తోంది. సర్వే రిపోర్టు అందిన తర్వాత.. పనితీరు పేలవంగా ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉన్నట్టుగా టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కోక్కరితో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టుగా తెలిపాయి. పనితీరు పేలవంగా ఉన్న ఎమ్మెల్యేలు.. వారి పనితీరును మెరుగుపరచుకోవడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలనే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మరోసారి సర్వే నిర్వహించి.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వారికి పార్టీ టికెట్ ఇచ్చే విషయంపై ఓ నిర్ణయానికి రానున్నారు.
ఇక, ఇప్పటికే 30 నియోజవర్గాలకు సంబంధించి సర్వే నివేదికలు గులాబీ బాస్ వద్దకు చేరాయని.. మిగిలినవి కూడా మరో రెండు వారాలు(ఏప్రిల్ 15 లోగా) అందనున్నట్టుగా సమాచారం. అయితే సర్వే రిపోర్ట్ అందిన 30 నియోజవర్గాల్లోని ఓటర్లు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల సంతోషంగా ఉన్నారని తేలింది. అయితే కొన్ని చోట్ల సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ఓటర్లు అసంతృప్తితో ఉన్నారని.. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు రెండు అంతకంటే ఎక్కువసార్లు ఎన్నికైన అసెంబ్లీ నియోజవర్గాల్లో వారిపై వ్యతిరేక ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది.
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 మంది ఎమ్మెల్యేలలో.. 90 మంది ఎమ్మెల్యేలు ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలుపొందారు. వీరిలో 80 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఉన్నారు. 119 మంది ఎమ్మెల్యేల్లో.. 44 మంది ఎమ్మెల్యేలు రెండు దఫాలు, 22 మంది ఎమ్మెల్యేలు మూడు సార్లు, 14 మంది ఎమ్మెల్యేలు నాలుగుసార్లు, 5 మంది ఎమ్మెల్యేలు ఐదుసార్లు, 4 మంది ఎమ్మెల్యేలు ఆరుసార్లు గెలిచిన వారు ఉన్నారు. ఎక్కువ పర్యాయాలు గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే ఉన్నారు.
మొత్తంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లు సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పటికీ.. పలుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని అని సర్వేలు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
