హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రెండు నెలలుగా ప్లాన్ చేసుకుంటున్నారా...అందులో భాగంగానే తన అనుచరులను కాంగ్రెస్ లోకి పంపారా. కాంగ్రెస్ పార్టీలో సీట్ల లొల్లి తారా స్థాయిలో ఉన్నా సీనియర్లకు మెుండి చేయి చూపినా కొత్తగా వచ్చిన ఇద్దరు నేతలకు టిక్కెట్లు ఇవ్వడం వెనుక రహస్యం ఇదేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. 

రంగారెడ్డి జిల్లాలో తనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నేతలు రెండు నెలల క్రితం కలిశారట. కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానం పలికారని సమాచారం. 

ఆ చర్చల్లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కండీషన్స్ పెట్టినట్లు సమాచారం. తన వర్గంలో ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ లతోపాటు తనకు చేవేళ్ల ఎంపీ స్థానాన్ని ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. 
ఒప్పందంలో భాగంగా  టీఆర్ఎస్ పార్టీ నేతలు కేఎస్ రత్నం, రోహిత్ లను కాంగ్రెస్ పార్టీలోకి పంపినట్లు సమాచారం. 

కేఎస్ రత్నంకు చేవేళ్ల సీటు కేటాయించగా...రోహిత్ కు తాండూరు సీట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఏళ్ల తరబడి ఉన్న సీనియర్లే తమ సీట్ల కోసం మల్లగుల్లాలు పడితే ఇటీవలే పార్టీలోకి చేరిన నేతలకు టిక్కెట్లు దక్కడం అటు కాంగ్రెస్ పార్టీతోపాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చజరిగింది. 

ఈ వార్తలు కూడా చదవండి

రేవంత్ మాట నిజమే,టీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ డౌన్

కేసీఆర్‌కు బిగ్ షాక్: టీఆర్ఎస్‌కు ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా