Asianet News TeluguAsianet News Telugu

కంచ ఐలయ్య వివాదంపై విరసం స్పందన

  • కంచ వివాదంపై విప్లవ రచయితల సంఘం ప్రకటన
  • ఐలయ్య మీద రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాల దాడిగా అభివర్ణించిన విరసం
virasam react on kancha ailaiah insident

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్లు అనే పుస్తకం తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లో తీవ్ర వివాదం సృష్టించింది. దీంతో విప్లవ రచయితల సంఘం ఈ వివాదంపై స్పందించింది. విరసం ప్రటకన పూర్తి వివరాలు కింద చచదవండి.

ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య మీద జరుగుతున్న దాడిని విరసం తీవ్రంగా ఖండిస్తోంది. ఇది కుల ఆధిపత్యం, దానికి కొమ్ముకాస్తున్న పాలకవర్గం, సంఘపరివార్‌ కలిసి చేస్తున్న దాడి తప్ప మరోటి కాదు. కంచె ఐలయ్య పీడిత, ఉత్పత్తి కులాల కోణం నుండి భారత సమాజాన్ని పరిశోధించి రచనలు చేస్తున్నారు. ఆయన విశ్లేషణా పద్ధతి మీద ఎవరికైనా విమర్శలు ఉండవచ్చు. విరసం కూడా ఆయన పరిశీలనా పద్ధతితో విభేదిస్తుంది. ఇది చాలా మామూలు విషయం. భావాలు సంఘర్షించాలి. అందులోనే సమాజ వికాసం ఉంటుంది. భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు.

వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, సామాజిక అణచివేతకు, అవమానాలకు గురవుతున్న సమూహాలు ఈ దేశ చరిత్రను, సాంఘిక వ్యవస్థను ఎలా చూస్తారో, ఎలా అర్థం చేసుకుంటారో ఆలోచించగలిగితే ఐలయ్య వంటి బహుజన మేధావుల స్వరంలోని 'తీవ్రత' అర్థమవుతుంది. మన సమాజం ఉపయోగించే సాధారణ భాషలో, తిట్లలో, సామెతలల్లో దళిత, బహుజన కులాలను, స్త్రీలను అవమానించే వ్యక్తీరణలు ఎన్నో చెప్పాలంటే ఎన్ని పుస్తకాలు నిండాలో. తరతరాలపాటు సామాజిక సంపదకు, విద్యకు, గౌరవప్రదమైన జీవితాలకు దూరం చేయబడిన సమూహాలు నోరుతెరిస్తే, తమ చరిత్రను తాము రాయను మొదలుపెడితే పచ్చిగా, చేదుగానే ఉంటుంది. అందులో ఎవరు ఎన్ని పరిమితులైనా చూపించవచ్చుగాని, అది సహజంగా వచ్చే ప్రతిక్రియ. ఇన్నేళ్లూ అన్నేసి తిట్లను పడ్డవాళ్లు తప్పకుండా అంటారు. ఇది ఒక్క ఐలయ్యకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అన్ని కులాల్లోని ఆలోచనాపరులు, ప్రజాస్వామికవాదులు ఎంతగా దీనిని అర్థం చేసుకుంటే సమాజ ప్రజాస్వామికీకరణకు అంతగా తోడ్పడినవాళ్లవుతారు.

ఇప్పుడు కోమటి కులం మీద చేసిన వ్యాఖ్యకు నొచ్చుకొని కంచె ఐలయ్య అనే వ్యక్తిపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహం పైకి కనిపిస్తోంది కాని దీనిని అంతమాత్రంగానే చూడకూడదు. అంతమాత్రమే అయితే రాజ్యం జోక్యం చేసుకొని ఒక రచన మీద, అంటే ఒక ఆలోచన మీద కేసు నమోదు చేసేదాకా పోదు. ఇప్పుడు ఐలయ్యకు వ్యతిరేకంగా ముందుకొస్తున్న అధిపత్య కులాలు, సంఘపరివార్‌లది మొత్తంగా పీడిత ప్రజల ప్రతిఘటనా చైతన్యాన్ని ఓర్వలేనితనమే. ఐలయ్య సందర్భాన్ని తక్షణంగా అందిపుచ్చుకున్నారుగాని కొంత కాలంగా అట్టడుగు కులాల నుండి పెరుగుతున్న సంఘటితత్వాన్ని, ప్రశ్నించేతనాన్ని దెబ్బతీయడానికి, కుల ఆధిపత్యాన్ని నిలిపి ఉంచడానికి పాలక వ్యవస్థ నుండి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆధిపత్య కులాలు పీడిత కులాలకు ప్రతిగా సంఘటితం కావడం, సంఘపరివార్‌ రాజకీయాలు వారికి తోడవ్వడం ఇటీవల జరుగుతున్న ప్రమాదకరమైన పరిణామం. అందులో భాగంగానే ఇప్పుడు ఐలయ్యకు వ్యతిరేకంగా సంఘపరివార్‌ హిందుత్వను ముందుకు తీసుకొస్తోంది.

ఆధిపత్యకులాలను ఒక మాట అంటే అది కులవ్యవస్థను ప్రశ్నించడం కాబట్టి హిందూ మతాన్ని టార్గెట్‌ చేయడంగా సంఘపరివర్‌ చెప్తుంది. హిందూ మతాన్ని ఏమన్నా అది దేశాన్ని అవమానించడమని, కాబట్టి దేశద్రోహమని కూడా అంటుంది. ఒక ఆదినారయణ రెడ్డో, ఒక చాగంటి కోటేశ్వరరావో దళిత బహుజనులను అవమానపరిస్తే రాజ్యం, సంఘపరివార్‌ జోక్యం చేసుకోవు. ముస్లింలను చంపుతున్నారు అంటే స్వయంగా ప్రధానమంత్రి కారు కింద పడ్డ కుక్క పిల్ల పోలిక తీసుకువస్తారు. స్త్రీల మీద జరుగుతున్న దాడుల ప్రస్తావన వచ్చనప్పుడు స్త్రీలను గురించి మంత్రులే ఎంత నేలబారుగా మాట్లాడతారో చూస్తున్నాం. గరగపర్రు, నేరెళ్ల వంటి కులరాజకీయాలను రాజ్యమే నడిపిస్తుంది. దళితులను పోలీసులే చిత్రహింసలు పెడతారు. వ్యవస్థపై అంతస్తులో ఉన్న వాళ్లు ఏమైనా మాట్లాడతారు. ఏమైనా చేస్తారు. దానికి వ్యతిరేకంగా లేచే గొంతు మాత్రం రాజద్రోహమవుతుంది. అంటే ఇది ప్రజల ప్రత్యామ్నాయ ఆలోచనల మీద, నిరసన స్వరం మీద, ప్రశ్నించే చైతన్యం మీద దాడి.

తక్షణం ఐలయ్య మీద కేసును విరమించుకోవాలి. ఆయనకే అపకారం జరక్కుండా ప్రభుత్వం తగిన ఆదేశాలివ్వాలి. సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే పరస్పర భావాలను చర్చించుకునే వాతావరణాన్ని, వేదికలను ఏర్పాటుచేయాలి.

-వరలక్ష్మి (కార్యదర్శి), పాణి, కాశీం (కార్యవర్గ సభ్యులు), వరవరరావు (సీనియర్‌ సభ్యులు) విప్లవ రచయితల సంఘం

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios