దారుణం: కరోనా రోగిపై దాడికి యత్నం, ఆదుకొన్న ఇంటి యజమాని
కరోనా సోకిన రోగికి టిఫిన్ పెట్టేందుకు వ్చచిన వ్యక్తిపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించారు. దీంతో కరోనా సోకిన రోగి తిరిగి ఇంటికి చేరుకొన్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.
నిజామాబాద్: కరోనా సోకిన రోగికి టిఫిన్ పెట్టేందుకు వ్చచిన వ్యక్తిపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించారు. దీంతో కరోనా సోకిన రోగి తిరిగి ఇంటికి చేరుకొన్నాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి గోదాం రోడ్ కాలనీలోని వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ఆయన తాను నివాసం ఉంటున్న అద్దె ఇంట్లోనే హోం ఐసోలేషన్ లోనే ఉంటున్నాడు. ఈ ఇంట్లో ఎండ సరిగా లేదు. దీంతో ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఇదే పట్టణంలోని హౌసింగ్ కాలనీలోని తన బంధువు ఇంటికి బాధితుడు శుక్రవారం నాడు రాత్రి చేరుకొన్నాడు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆందోళనకు దిగారు.
ఈ విషయం తెలిసిన వైద్య ఆరోగ్య సిబ్బంది అక్కడికి చేరుకొని స్థానికులకు నచ్చచెప్పారు. శనివారం నాడు ఉదయం బాధితుడికి అతని మిత్రుడు టిఫిన్ తెచ్చి ఇస్తుండగా కాలనీవాసులు కొందరు రాళ్లు పట్టుకొని దాడికి సిద్దమయ్యారు. దీంతో అతను వెళ్లిపోయాడు.
కరోనా సోకిన వ్యక్తి కాలనీలో ఉండవద్దని డిమాండ్ చేశారు. అతను కాలనీలో ఉంటే తమకు కూడ కరోనా వస్తోందని కాలనీవాసులు ఆందోళన చేశారు. రాళ్లతో అతడిని తరిమికొడతామని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకొన్న వైద్యాధికారులు, ఎస్ఐ రవికుమార్ అక్కడకు చేరుకొన్నారు. వైద్యులు, పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా కూడ కాలనీవాసులు వినలేదు. దీంతో బాధితుడు తాను నివాసం ఉంటున్న అద్దె ఇంటికి చేరుకొన్నాడు.
బాధితుడు తన ఇంటికి స్కూటీపై చేరుకొనే వరకు పోలీసులు, వైద్య సిబ్బంది అతని వెనుకే వెళ్లారు. హౌసింగ్ బోర్డులో చోటు చేసుకొన్న ఘటన విషయం తెలుసుకొన్న ఇంటి యజమాని బాధితుడికి ఫోన్ చేసి అద్దె ఇంటికే రావాలని సూచించాడు.
ఎండ కోసమే తాను హౌసింగ్ బోర్డు కాలనీలోని తన బంధువుల ఇంటికి వెళ్లినట్టుగా బాధితుడు తెలిపారు. కరోనా సోకిన తనకు ధైర్యం చెప్పకుండా ఇబ్బంది పెట్టారని బాధితుడు ఆరోపించారు.