వరద తగ్గడంతో మోరంచపల్లికి :సర్వం కోల్పోయి గ్రామస్తుల కంటతడి
వరద తగ్గడంతో మోరంచపల్లికి గ్రామస్తులు చేరుకున్నారు. వరద ధాటికి గ్రామస్తులు సర్వం కోల్పోయారు.
వరంగల్: వరద తగ్గుముఖం పట్టడంతో మోరంచపల్లివాసులు శుక్రవారం నాడు గ్రామానికి చేరుకున్నారు. వరద మిగిల్చిన బురదతో గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ వాగు వరదలో గ్రామస్తులు సర్వం కోల్పోయారు. బురదతో నిండిపోయిన ఇళ్లను చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇళ్లకు చేరుకున్న స్థానికులు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు. 12 గంటల పాటు వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్రామస్తులు గడిపారు. ఈ గ్రామంలో 250 కుటుంబాలు నివాసం ఉంటాయి.
పాలు, పెరుగు విక్రయంతో పాటు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మోరంచపల్లి వాగు ఈ గ్రామాన్ని ముంచెత్తింది. గ్రామానికి సమీపంలోని బ్రిడ్జిపై ఆరు ఫీట్ల ఎత్తులో వరద ప్రవహించింది. మోరంచపల్లిలో ఎన్‌డీఆర్ఎఫ్, ఫైర్ , ఆర్మీ అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులను కాపాడారు. వరద నీరు తగ్గడంతో స్థానికులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో పరిస్థితిని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తదితరులు పరిశీలించారు.
గ్రామంలో బురద తొలగింపు చర్యలను ప్రారంభించినట్టుగా కలెక్టర్ మిశ్రా చెప్పారు. గ్రామస్తులకు రెండు స్కూళ్లలో పునరావాసం ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. గ్రామంలో జరిగిన నష్టంపై అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్టుగా కలెక్టర్ వివరించారు.
వరదల కారణంగా గ్రామం నుండి ముగ్గురు వరదల్లో గల్లంతైనట్టుగా సమాచారం అందిందని కలెక్టర్ చెప్పారు. అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. మరో వైపు గ్రామానికి చెందిన ఐదుగురు వరదలో గల్లంతయ్యారని మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే ఇందులో రెండు మృతదేహలు లభ్యం కాగా, మరో మూడు మృతదేహల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా మీడియా రిపోర్టు చేస్తుంది. భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాల కారణంగా మోరంచపల్లి వాగు వరద ముంచెత్తింది.