హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎల్పీ విలీనంపై కాకుండా రాష్ట్రంలో విద్యార్థుల మరణాలు, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు టీపీసీసీ కాంపైన్ కమిటీ చైర్మన్ విజయశాంతి. 

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగి 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించండంటూ సూచించారు. హైదరాబాద్ లో ఓ చానెల్ తో మాట్లాడిన ఆమె రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే వాటిని పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేద్దామా ఎమ్మెల్యేలను లాగేసుకుందామా అన్నదానిపైనే దృష్టి సారించారని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సమస్యలను తాము పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం అయితే టీఆర్ఎస్ అందులో ఒక బొట్టులాంటిదని విజయశాంతి విమర్శించారు. చెత్తచెదారం పోతుంటుంది కొత్త రక్తం వస్తుంటుందన్నారు. పోయేవాళ్లు పోతారు వచ్చేవాళ్లు వస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరుగుతుందని కొత్తవారు వస్తారని ఈలోగా చెత్తచెదారం ఉంటే పోతుందన్నారు. 

ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోలేని వ్యక్తులు నిలకడలేని నేతలు రాజకీయాల్లో ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటేనన్నారు. అలాంటి వారు ఉన్న ఒక్కటే పోయినా ఒక్కటేనన్నారు. వారంతా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి టికెట్లు ఇస్తామని వారిని గెలిపించుకుంటామని విజయశాంతి స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం కుర్చీ తప్ప విద్యార్థులు మరణాలు కనిపించవా : కేసీఆర్ పై విజయశాంతి ఫైర్