హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దురదృష్టకరమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాంపైన్ కమిటీ చైర్మన్ విజయశాంతి ఆరోపించారు. 

రాష్ట్రంలో ఎవరు చనిపోయినా స్పందించడం లేదని కేసీఆర్ కు కావాల్సింది కేవలం కుర్చీమాత్రమేనని ఆరోపించారు. తెలంగాణలో ఏం జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

హైదరాబాద్ లో ఓ ఛానెల్ తో మాట్లాడిన విజయశాంతి ఇంత మంది విద్యార్థులు చనిపోతే స్పందించరా అని నిలదీశారు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయినా పర్లేదు డోంట్ కేర్ అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

దొరగారు స్పందిస్తారా స్పందించండి లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని హితవు పలికారు. గ్లోబరీనా అనే సంస్థకు ఎందుకు పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. 

కేసీఆర్ దొరకు మంచిది కాదన్నారు. బాధ్యతగల ముఖ్యమంత్రిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కానీ అలా చెయ్యకుండా టెక్నికల్ టీం వేశామని చెప్పుకోవడం కేవలం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడమేనని స్పష్టం చేశారు. 

గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించడం వెనుక చాలా పెద్ద వ్యవహారం నడిచిందన్నారు. ఇంటర్మీడియట్ మార్కుల అవకతవకలపై ఎవరికో లాభం చేకూరడం వల్లే ఇంత నష్టం వాటిల్లిందన్నారు. 

సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ కు ఎంత ముడుపులు అందాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ వైఖరిలో మార్పు తెచ్చుకుని విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. బిడ్డలను కోల్పోయి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటే కనీసం స్పందించరా అని విజయశాంతి నిలదీశారు.