హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అయితే ఎన్నికల కోసమే కేసీఆర్ ఫాంహౌస్ నుండి బయటకు వస్తున్నారని... ఎన్నికలు ముగిశాక ఆయన కనిపించడం అసాధ్యమంటూ మాజీ ఎంపి విజయశాంతి విమర్శించారు. 

''జీహెచ్ఎంసీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు సవినయ మనవి... రేపటి కేసీఆర్ గారి ఎన్నికల ప్రచార బహిరంగ సభ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దొరగారిని ఒక్కసారి చూసుకోండ్రి. మల్లా ఇంక ఇప్పట్లో ఎన్నికలు లేకుంటే వారు కనబడేది, వినబడేది అసాధ్యం''  అంటూ సీఎం కేసీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు. 

''ప్రజలు ఇప్పుడున్న కష్టాలకు సీఎం గారి కామెడీ వాగ్దానాల ద్వారా ఏదో కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉండవచ్చు. హామీల అమలు ఎప్పటిలాగే ఏమీ ఉండదని మనందరికీ ఎప్పుడూ తెలిసిన కార్యక్రమమే...'' అని సెటైర్లు విసిరారు. 

''జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆరెస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎంతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరిక్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి'' అంటూ విజయశాంతి అనుమానం వ్యక్తం చేశారు. 

''జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవని నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతి భద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు... క్షమించదు'' అంటూ ట్విట్టర్ వేదికన సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు విజయశాంతి.