కొలువుల కొట్లాట సభకు హైకోర్టు అనుమతి సర్కారు అనుమతి నిరాకరణ సరికాదన్న న్యాయస్థానం న్యాయపోరాటంలో గెలిచిన తెలంగాణ జెఎసి నిరుద్యోగ సమస్యను ప్రపంచానికి చాటనున్న జెఎసి సరూర్ నగర్ మైదానంలో కొట్లటకు సిద్ధమవుతున్న జెఎసి
తెలంగాణ జెఎసి అలుపెరగని పోరాటం ఫలించింది. తెలంగాణ సర్కారుతో కొట్లాడేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీరు నిరుద్యోగల పక్షాన కొట్లాడితే వచ్చే ఇబ్బందేం లేదని హైకోర్టు తాజాగా జెఎసి పక్షాన తీర్పిచ్చింది. జెఎసి మీద తెలంగాణ సర్కారు పన్నిన కుట్రలను హైకోర్టు భగ్నం చేసింది.
గత కొంతకాలంగా తెలంగాణ సర్కారు జెఎసి మీద ఉక్కుపాదం మోపింది. జెఎసి ఛైర్మన్ కోదండరాం అడుగు తీసి అడుగు పెట్టకుండా అడ్డంకులు సృష్టించింది. ఆయన ఇంట్లో ఉన్నా సరే అరెస్టు చేస్తామన్నట్లు బెదిరించింది. దీంతో జెఎసి కార్యక్రమాలన్నీ బంద్ చేయించింది. కోదండరాం బయట కనబడితే అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పింది. తీరా ఇప్పుడు హైకోర్టులో వచ్చిన తీర్పు తెలంగాణ జెఎసి కి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది.
ఇటీవల కాలంలో తెలంగాణ జెఎసి రెండు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టింది. అందులో ఒకటి అమరుల స్పూర్తి యాత్ర .ఈ యాత్రను దశలవారీగా జరుపుతూ వచ్చింది జెఎసి. అయితే ముందుగా ఆ యాత్ర తుస్సుమంటదని భావించిన సర్కారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ తెలంగాణలో సర్కారు వ్యతిరేకులంతా జెఎసి స్పూర్తియాత్రకు మద్దతు ఇస్తూ వస్తున్న నేపథ్యంలో స్పూర్తియాత్రకు బ్రేక్ వేసింది సర్కారు. ఉత్త పుణ్యానికే శాంతి భద్రతల సమస్యన సృష్టించి జెఎసి అమరుల స్పూర్తియాత్రను సక్సెస్ ఫుల్ గా నిలిపివేయించింది.
ఇక రెండో కార్యక్రమం గా కొలువులకై కొట్లాట సభను నిర్వహించాలని జెఎసి నిర్ణయించింది. ఈ నిర్ణయం తెలంగాణ సర్కారుకు పుండు మీద కారం చల్లినట్లు అయింది. ఇప్పటికే తెలంగాణలో ఉద్యోగాల కల్పన విషయంలో తెలంగాణ సర్కారు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. తెలంగాణ లో టిఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా రికార్డు సృష్టించింది. దీంతోపాటు యూనివర్శిటీల్లో పోస్టుల భర్తీ జరగలేదు. ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో భర్తీ జరగలేదు. మొత్తానికి లక్షా 7వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశగా ప్రయాత్నాలేవీ జరడంలేదు. జరిగినా అట్టర్ ప్లాఫ్ అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో యువతలో సర్కారు మీద ఆగ్రహం రోజురోజుకూ పెరిగిపోతున్నది.
దీనికితోడు తెలంగాణ సర్కారు ఎంతో గొప్పగా భావించి ప్రకటించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకమండలి ఉద్యోగాల ప్రకటనలు ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. ప్రతి నోటిఫికేషన్ కోర్టు మెట్లెక్కింది. సర్కారుకు మొట్టికాయలు వేసే పరిస్థితిని కల్పించింది. ఒక్క నోటిఫికేషన్ కూడా విజయవంతంగా చేపట్టిన పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కొలువులకై కొట్లాట సభ జరిపి నిరుద్యోగుల సమస్యను జాతికి తెలియజేయడం ద్వారా ప్రభుత్వం పై వత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. కానీ తెలంగాణ సర్కారు కొలువులకై కొట్లాట సభ జరగనిచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. జెఎసి సభ పెడితే నక్సలైట్లు చెలరేగిపోతారని హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి స్వయంగా ప్రకటించారు. అందుకే సభకు అనుమతి లేదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ కాలంలో ఎలాంటి భాష వాడిందో అదే భాషను తిరిగి వినియోగించారు తెలంగాణ హోంమంత్రి. దీంతో జెఎసి ఎలాంటి అడ్డంకులు లేకుండా కొలువుల కొట్లాట సభ జరిపేందుకు అనుమతి ఇప్పించాలని కోరుతూ హైకోర్టు తలుపుతట్టింది. అన్ని విచారించిన హైకోర్టు కొలువుల కొట్లాట సభ జరుపుకోవచ్చని అనుమతించింది. సరూర్ నగర్ స్టేడియంలో కొలువుల కోసం కొట్లాట సభకు అనుమతించడంతోపాటు తెలంగాణ సర్కారుకు గట్టి షాకే ఇచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో పాలకుల తీరును న్యాయస్థానం ఎండగట్టింది.
