హైదరాబాద్: తెలంగాణలో గణేష్ ఉత్సవాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను నిరసిస్తూ  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం నాడు రాష్ట్రంలోని పలు చోట్ల  నల్లజెండాలు ఎగురవేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

హైద్రాబాద్ లోని ఖైరతాబాద్ మహా గణపతి ముందు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం నిర్వహించారు.   ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు  మాట్లాడుతూ  ప్రజల ఆధ్యాత్మికత మరియు జీవనోపాధితో ముడిపడిన గణేష్ ఉత్సవాలకు కోవిడ్-19 నియమాలు పాటిస్తూ జరుపుకోవడానికి అనుమతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆంక్షలను విధించిందన్నారు.

గణేష్ ఉత్సవాలపై అప్రకటిత నిర్బందాలు విధించి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులతో, పోలీసులతో మండప నిర్వాహకులపై కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. 

 భక్తులు నెలకొల్పిన మండపాలను కూల్చివేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు., ఒక రకంగా హిందూ సమాజంపై కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా యుద్ధం ప్రకటించిందన్నారు.

ముస్లీం ల పండుగలైన రంజాన్  బక్రీద్ లకు కోవిడ్-19 నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాట్లు చేసి ప్రస్తుతం మొహర్రం ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం పోలీసులు హిందువుల పండుగలు కోవిడ్- 19 నిబంధనలు పాటిస్తూ జరుపు కుంటామంటే దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.

ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ మరో నిజాం లా పాలన సాగిస్తుంటే రాష్ట్ర పోలీసులు రజాకార్లను తలపిస్తున్నారని ఆయన విమర్శించారు.రాష్ట్ర హైకోర్టు చెప్పినా హిందువుల ప్రాథమిక హక్కులను ప్రభుత్వం కాని పోలీసులు కానీ గౌరవించలేదన్నారు.

ఎంఐఎం ఎజెండాను అమలు చేస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి నయా నిజాం కేసీఆర్ హిందూ వ్యతిరేక అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడటానికి హిందూ సమాజం సమాయత్తమవుతుందన్నారు.

 గణేష్ మండపాలపై పోలీసులు చేసిన ప్రత్యక్ష దాడులకు సంబంధించి విశ్రాంత న్యాయ మూర్తులు  న్యాయవాదులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పూర్తి ఆధారాలతో రాష్ట్ర హైకోర్టుకు గవర్నర్ గారికి నివేదిక సమర్పించి చట్టపరంగా దోషులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రతి హిందూ హృదయాన్ని గాయపరచిన కేసీఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు.