చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్: విహెచ్ సంచలన వ్యాఖ్య

చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్లాన్: విహెచ్ సంచలన వ్యాఖ్య

హైదరాబాద్: కర్ణాటక పరిణామాల నేపథ్యంలో బిజెపిపై తెలంగాణ మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. 
కర్ణాటక వ్యవహారంలో బీజేపీ అనుసరించిన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.. కర్ణాటకలో న్యాయం గెలిచిందని, అవినీతి ఓడిపోయిందని ఆయన శనివారం మీడియాతో అన్నారు. న్యాయాన్ని కాపాడిన సుప్రీంకోర్టుకు సలాం అని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యడ్యూరప్ప రాజీనామా కాంగ్రెస్ విజయమేనని ఆయన అన్నారు. 2019 ఎన్నికలకు ఇది పునాది అని ఉత్తమ్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ విమర్శించారు. కర్ణాటక వ్యవహారంలో న్యాయం చేసినందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 

గోవా, మేఘాలయాలో దొడ్డిదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. కాంగ్రెస్‌కు అధికారదాహం లేదని, అందుకే జేడీఎస్‌కు మద్దతు ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోకుండా పార్టీకి విధేయతగా ఉన్నారని, మోడీ, బీజేపీ పతనం కర్ణాటక నుంచే ప్రారంభమవుతుందని అన్నారు.

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని కాంగ్రెసు తెలంగాణ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గవర్నర్ వ్యవస్థలో మార్పు రావాలని, కర్ణాటక గవర్నర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన శనివారం మీడియాతో అన్నారు. అప్రజాస్వామిక చర్యలను ఎవరూ క్షమించకూడదని ఆయన అన్నారు. 

బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. దానికి కర్ణాటకలో నాంది పడిందని మర్రి శశిధర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page